జోరుగా పేకాట దందా | - | Sakshi
Sakshi News home page

జోరుగా పేకాట దందా

Aug 9 2025 5:58 AM | Updated on Aug 9 2025 5:58 AM

జోరుగా పేకాట దందా

జోరుగా పేకాట దందా

అడ్డంగా బుక్‌ అవుతున్న బడాబాబులు

చేతులు మారుతున్న రూ.లక్షలు

బాన్సువాడ: పోలీసుల కంటపడకుండా ఉండేందుకు పేకాట ఆడేవారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పేరుతో ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని ఆందోళనతో వీరు ఎవరి కంటపడకుండా ఉండేందుకు రహస్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వారం పది రోజులుగా పోలీసులు జరుపుతున్న దాడుల్లో బడాబాబులు అడ్డంగా బుక్‌ అవుతున్నారు. బాన్సువాడ డివిజన్‌లోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌ ప్రాంతాల్లో పేకాటరాయుళ్లు గ్రుపులుగా ఏర్పడి పేకాట కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పది పదిహేను రోజులుగా పేకాట స్థావరాలపై పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో బడా వ్యాపారవేత్తలు బుక్‌ అవుతున్నారు. ఈ కేంద్రాల్లో రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పేకాటాడుతుండడంతో నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నాయి.

మూడు మండలాల అటవీ ప్రాంతం..

బాన్సువాడ, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌ శివారులో ఉండే అటవీ ప్రాంతాల్లో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించలేకపోతున్నారు. బాన్సువాడ మండలంలోని ముదెల్లి అటవీ ప్రాంతంతో పాటు హన్మాజీపేట్‌, కొత్తాబాది, బుడ్మి గ్రామ శివారుల్లో పేకాట అడ్డాలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ పట్టణంలో దాడులు జరుగుతున్నా పేకాట రాయుళ్లు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పోలీసులకు ఇటీవల బడా వ్యాపారవేత్తలు, రియల్టర్లతో పాటు పలువురు దొరికారు. కొందరు బాన్సువాడకు చెందిన కొందరు వ్యాపారులు పేకాట ఆడేవారిని కర్ణాటక, మహారాష్ట్రలకు తమ సొంత వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులు అక్కడే ఉండి పేకాట ఆడించి మళ్లీ తమ వాహనాల్లోనే బాన్సువాడకు తీసుకువస్తారు. ఇలా తీసుకెళ్తే వారికి వాహనాల అద్దెతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పేకాట అడ్డాల నిర్వాహకులకు కమీషన్‌ కూడా ఇస్తారని తెలిసింది.

ఇటీవల పోలీసులు జరిపిన దాడుల వివరాలు..

మూడు నెలల కిత్రం బాన్సువాడ–బోధన్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గత నెల 8న బాన్సువాడ పట్టణంలో పార్కుకు వెళ్లే దారిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

ఈ నెల 3న సంగోజీపేట్‌లో పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్‌ చేశారు.

6న పట్టణంలోని సరస్వతి మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

ప్రత్యేక నిఘా పెట్టాం

పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. పేకాట ఆడే వాళ్లలో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పేకాట ఆడేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కూడా నిఘా పెడతాం. పేకాట ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.

– అశోక్‌, సీఐ, బాన్సువాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement