
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండా వద్ద గల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన తుంగర్ బాలాజి(50) స్థానిక హోటల్‌లో పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అతడు రూప్లానాయక్ తండా నుంచి దేవి తండాకు నడుచుకుంటూ హైవేపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కొడుకు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆలయంలో చోరీ
ఖలీల్‌వాడి: నగరంలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి వెండి కిరీటం, ఇత్తడి సాయిబాబా విగ్రహం, ఇత్తడి సామగ్రి అపహరించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు గుడికి వెళ్లగా, చోరీని గుర్తించి పోలీసుకలు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వారు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలుడి కిడ్నాప్
మోపాల్: మండలంలోని ముదక్‌పల్లి తండాకు చెందిన కెతావత్ హరీష్ (17) కిడ్నాప్‌నకు గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన హరీష్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో వారిని మందలించాడు. ఈక్రమంలో వివాహితను ఆమె భర్త ఈనెల 5న రాంచంద్రపల్లిలోని తల్లిగారింట్లో వదిలేసి వచ్చాడు. 7న సదరు వివాహిత హరీష్‌కు ఫోన్ చేయడంతో అతడు నిజామాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడు తిరిగి ఇంటికి రాలేడు. దీంతో బాలుడి సోదరి హరీష్ కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
దాబాపై పోలీసుల దాడి
నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం శివారులో గల దాబాపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా దాబాలో, బెల్టుషాపులో లిక్కర్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ఆరీఫ్ తెలిపారు. ఈ దాడిలో ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు.
పేకాడుతున్న పలువురి అరెస్టు
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో పేకాట స్థావరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.4,320 నగదు, 7 సెల్ ఫోన్లు, 2 బైకులతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
రుద్రూర్ మండలంలో..
రుద్రూర్: మండలంలోని రాణంపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 4510 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.
రెంజల్ మండలంలో..
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8470 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.