
నల్లా నీటిలో జలగలు
నిజాంసాగర్(జుక్కల్): ఒడ్డేపల్లిలో నల్లా నీటిలో జలగలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కుళాయిల ద్వారా జలగలు రావడంతో నీటిని తాగేది ఎలా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా జలగలు వస్తున్నాయని పంచాయ తీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కుళాయి జలగలు రాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. విద్యుత్ తీగలు కొన్ని చోట్ల మనిషికి అందే ఎత్తులో ఉన్నాయి. ట్రాన్స్‌కో అధికారులకు ఎన్ని సార్లు చెప్పినప్పటికి పట్టించుకోవడం ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వేలాడే వైర్ల క్రింద పంటలు ఎలా వేసుకోవాలో అర్థం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఐడియా అదిరెన్..!
మాచారెడ్డి: వరినాట్లు వేసేటపుడు సాధారణంగా రైతులు నారును రెండు చేతుల్లో పట్టుకెళ్లి మడుల్లో వేస్తారు. దాంతో ఆలస్యం కావడమే కాకుండా రైతుకు శ్రమ అధికంగా అవుతుంది. దీంతో చుక్కాపూర్ గ్రామానికి చెందిన జీడిపల్లి రాంరెడ్డి అనే యువరైతు నాటు వేయడం కోసం ట్రాక్టర్ వెనుకబాగంలో చీరలు కట్టి చీరపై నారును వేసి మడులకు తరలిస్తున్న దృశ్యాన్ని ఆదివారం ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
సాహిత్యంలో వరలక్ష్మికి డాక్టరేట్
డొంకేశ్వర్(ఆర్మూర్): సాహిత్యంలో రాణిస్తున్న డొంకేశ్వర్ మండలం తొండాకూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ వరలక్ష్మికి డాక్టరేట్ లభించింది. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన జాతీయస్థాయి భారత్ విభూషణ్–2025 అవార్డుల ప్రదానోత్సవంలో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందజేసింది. డాక్టరేట్‌ను అందజేసి ప్రోత్సహించిన యూనివర్సిటీకి ఈ సందర్భంగా వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

నల్లా నీటిలో జలగలు

నల్లా నీటిలో జలగలు