
కుదురుకోని బోర్లు..
● ఒర్రెలు, వాగులు పారలేదు ● చెరువుల్లో చుక్క నీరు చేరలేదు ● భూగర్భ జలం వృద్ధి చెందలేదు ● అయోమయంలో అన్నదాత
వరుణుడు కరుణిస్తేనే..
మైదానాన్ని తలపిస్తున్న నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి చెరువు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కార్తెలు కరిగిపోతున్నా జల్లులే తప్ప జడివానలు కురవలేదు. రోహిణీ కార్తెలోనే తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. ముందస్తు వర్షాలతో కాలం అనుకూలిస్తుందని ఆశించారు. మగశిర, ఆరుద్ర కార్తెలు అనుకూలించలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువులోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. కనీసం ఒర్రెలలో నీరు నిలిచేంత వాన కూడా కురవలేదు. రికార్డుల ప్రకారం జిల్లాలో ఈ రోజు వరకు సాధారణ వర్షపాతం 219.7 మిల్లీ మీటర్లు కాగా 216.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే జిల్లాలోని పెద్దకొడప్‌గల్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో సాధారణం, ఐదు మండలాల్లో కొంచెం ఎక్కువ కురిసింది. అయితే ఎక్కడ కూడా వాగులు పొంగి ప్రవహించేంతగా కురవలేదు. జిల్లాలో చిన్నాపెద్ద అన్నీ కలిపి 2,056 చెరువులు, కుంటలున్నాయి. చెరువుల కింద 96 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నెలన్నర కాలంగా భారీ వర్షాలు కురవకపోవడంతో కుంటలు, చెరువులన్నీ చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి.
5.11 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 5.11 లక్షల ఎకరాలలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా ఇప్పటివరకు 2.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వరి 67 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. వర్షాలు లేకపోవడం వల్లే వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. సోయా పంట 77,124 ఎకరాల్లో, మక్క పంట 43,651 ఎకరాలు, జొన్న 23,214 ఎకరాలు, పత్తి 30,958 ఎకరాల్లో సాగయ్యాయి.
ఈ ఏడాది ఎప్పుడూ లేనిది మే నెలలోనే భారీ వర్షం కురియడంతో రైతులు సంతోషించారు. నీటికి కొదవ ఉండదని భావించి అంతా పంటలు వేసుకున్నారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటల్లో కూడా నీరు అడుగంటిపోయి మైదానాలను తలపిస్తున్నాయి. కమ్ముకువస్తున్న మేఘాలను చూసి వరుణుడు కరుణిస్తాడని ఆశ పడడమే తప్ప ఒకటైనా భారీ వర్షం కురవలేదు. దీంతో వానాకాలం సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. అదను దాటిపోతుందేమోనని రైతులు భయపడుతున్నారు.
వానాకాలం సీజన్లో భారీ వర్షాలు లేకపోవడంతో బోర్లు ఇప్పటికీ కుదురుకోలేదు. చాలా చోట్ల రైతులు నారుమడులు పోసినా నాట్లు వేయడానికి సరిపడా నీరు అందడం లేదని చెబుతున్నారు. చాలా చోట్ల వేసవిలో ఎత్తిపోయిన బోర్లలో ఇప్పటికీ ఊటలు పెరగలేదు. నిజాంసాగర్ ఆయకట్టు కింద నాట్లు వేశారు. పోచారం ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చి చేరితేగానీ నాట్లు వేసే పరిస్థితి లేదు.
భారీ వర్షాలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా వరి సాగు చేయాలంటే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్తెలోనైనా వరుణుడు కరుణిస్తే సాగు ముందుకు నడుస్తుందని అంటున్నారు. ఆరుతడి పంటలకు కొంత అనుకూలంగా ఉంది. వరి నాట్లు వేయడానికి అదను దాటుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.