
బోనాల పండుగకు సర్వం సిద్ధం
● గత 51 ఏళ్లుగా నిరాటంకంగా
బోనాల ఉత్సవం
● రేపే దోమకొండలో
మహంకాళి బోనాల పండుగ
● 18 చేతులతో ప్రతి చేతిలో ఒక
ఆయుధంతో అమ్మవారు
దోమకొండ : దోమకొండలోని దేవి ఆలయాన్ని మహంకాళి, చాముండేశ్వరి ఆలయంగా పిలుస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీ మాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అమ్మవారు కార్యాలను విజయవంతం చేస్తుందని ప్రతీతి.
ఆలయ చారిత్రక నేపథ్యం..
దోమకొండ సంస్థానానికి చెందిన కామినేని వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 1943–1946 మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని జైపూర్ నుంచి అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని తెప్పించి 1972 అక్టోబర్ 28న ప్రతిష్ఠాపన చేశారు. ఇక్కడి అమ్మవారు రాక్షసులను సంహరిస్తుందనే రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి 18 చేతుల్లో ప్రతి చేతిలో ఒక ఆయుధం కలిగి ఉండటం విశేషం.
కోర్కెలు తీర్చే చాముండేశ్వరి అమ్మవారిగా..
బోనాల పండుగ 51 ఏళ్లుగా నిరాంటంకంగా కొనసాగుతోంది. ఏటా ఆషాఢంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం బోనాలు తీస్తారు. ఆదివారం (13న) ఉదయం భవిష్యవాణి, ఘటం ఊరేగింపు, పోతరాజులు జీవాలను గావు పట్టుట, మధ్యాహ్నం 12 గంటల నుంచి బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకొచ్చి మొక్కులు సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన 12 కిలోల వెండితో ఇటీవల అమ్మవారికి మకరతోరణం చేయించారు. మండల కేంద్రంలో దాదాపు 4,250 కుటుంబాలు నివసిస్తుండగా ప్రతి ఇంటి నుంచి బోనం సమర్పిస్తారు. బోనాల పండుగ రోజు బంధువులు, స్నేహితులను పిలుచుకుంటారు. తెలంగాణలోనే రెండో మహంకాళి అమ్మవారి ఆలయంగా ఇక్కడి దేవాలయం పేరుగాంచింది. బోనాల అనంతరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో దసరా దేవి నవరాత్రి ఉత్సవాలను కూడా ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తారు.
బీబీపేటలో బోనాలకు ఏర్పాట్లు
బీబీపేట : మండల కేంద్రంలోని మహంకాళి అ మ్మవారి బోనాలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశా రు. పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అలాగే గుంతలు ఉన్న ప్రాంతంలో మొరం పోయించడంతో పాటు విద్యుత్ దీపాలను అమర్చారు.

బోనాల పండుగకు సర్వం సిద్ధం