
రాజకీయ కుట్రతోనే నా అరెస్టు
కామారెడ్డి టౌన్: పేలుడు పదార్థాల కేసు వ్యవహారంలో రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేయించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. గురువారం బెయిల్‌పై వచ్చిన తర్వాత శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక ఓ పెద్దమనిషి హస్తంతో అరెస్టు జరిగిందని ఆరోపించారు. ఈనెల 3న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ లభ్యమైన లింగాపూర్ శివారులోని వెంచర్‌లో తనకు గజం స్థలం కూడా లేదన్నారు. పేలుడు పదార్థాలకు తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో విచారణకు పిలిచిన డీఎస్పీ, సీఐకి ఆ వెంచర్‌కు సంబంధించి 1800 ఎకరాల భూమి పత్రాలను, ప్లాట్ల వివరాలను ఇచ్చానని తెలిపారు. ఈనెల 5వ తేదీన రాత్రి రూరల్ సీఐ వచ్చి ఎస్పీతో మాట్లాడుతారట వెళ్దామని చెప్పి ఓ ప్రైవేట్ వాహనంలో ఎస్పీ కార్యాలయం కాకుండా నేరుగా జాతీయ రహదారికి మళ్లీంచి బాన్సువాడకు అర్ధరాత్రి తీసుకెళ్లి ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించారని తెలిపారు. అక్కడి నుంచి తెల్లవారుజామున నిజామాబాద్ జైలుకు తరలించారని వివరించారు. పోలీసుల వద్దకు తానే స్వయంగా వెళ్తే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం తప్పించుకుని తిరుగుతున్నానని, అశోక్‌నగర్‌కాలనీ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్నారని పొందుపర్చడం సరికాదన్నారు.అరెస్టులో పోలీసుల తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై ఓ మాజీ కౌన్సిలర్ తప్పుడు ప్రచారం చేసాడని తెలిపారు.తనపై కుట్ర చేసిన ప్రతి ఒక్కరి బండారం సమయం వచ్చినప్పుడు బయటపెడుతానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో నాయకులు రవి, సలీం, పంపరి శ్రీనివాస్, సాయిబాబా, చాట్ల వంశీ తదితరులున్నారు.
పోలీసుల తీరుపై
డీఐజీకి ఫిర్యాదు చేస్తా
పేలుడు పదార్థాలకు
నాకు ఎలాంటి సంబంధం లేదు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
చంద్రశేఖర్‌రెడ్డి