
మాంసం దుకాణాలు తొలగించాలని ఆందోళన
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని హైస్కూ ల్, ప్రైమరీ పాఠశాల ప్రహరీ గేటు వద్ద ఉన్న చికెన్, మటన్ మాంసం దుకాణాలను తొలగించాలని కోరుతూ శుక్రవారం విద్యార్థులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాంసం దుకాణాల కారణంగా కుక్కలు విద్యార్థులపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కుక్కల భయంతో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. చీకటిపడితే పాఠశాల ఆవరణలో మద్యం సేవించి గాజు బాటిళ్లు పగలగొడుతున్నారు. కాళ్లకు గుచ్చుకొని గాయాలు అవుతున్నాయని వాపోయారు. వారం రోజుల్లో మాంసం దుకాణాలు తొలగిస్తామని కమిషనర్ ఖయ్యుం విద్యార్థులకు హామీ ఇచ్చారు. మాంసం దుకాణాదారులకు నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మాంసం కోసం కేటాయించిన మార్కెట్‌లో దుకాణాలు పెట్టుకోవాలని అక్కడ మున్సిపల్ నుంచి నీరు, మురికి కాలువలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని దుకాణదారులకు కమిషనర్ సూచించారు.