
అసంపూర్తిగా సమీకృత మార్కెట్
ఎల్లారెడ్డి: పట్టణ ప్రాంతాలైన కార్పోరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నిత్యావసరాలైన కూరగాయలు, మాంసం ఉత్పత్తులు, పండ్లు ఒకేచోట లభించేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ల(ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను మంజూరు చేసింది. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం కామారెడ్డికి రూ. 4 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడలకు రూ. 2 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఈ పనులకు 2021–22 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు పూర్తి చేశారు. 2022 లో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించారు.
అగ్రిమెంట్లు చేసుకున్న కామారెడ్డి, బాన్సువాడ కాంట్రాక్టర్లకు టెండర్ మొత్తంలో సగభాగాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చారు. అయితే ఎల్లారెడ్డిలో మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో డీఎస్పీ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలు ఉండడంతో వాటిని ఖాళీ చేయడానికి చాలా కాలం పట్టింది. 2022లో అగ్రిమెంట్ చేసుకున్నా మార్కెట్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో కార్యాలయాలను కూల్చివేసి స్థలం అప్పగించే ప్రక్రియ 2023 డిసెంబర్‌కు కానీ సాధ్యం కాలేదు. నిర్మాణ పనులు చేపట్టడంలో సుదీర్ఘ జాప్యం జరగడంతో ఎల్లారెడ్డి కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ అందలేదు. అయినా బిల్లులు వస్తాయన్న ఆశతో సొంత డబ్బులతో పనులు చేశారు. గతేడాది ఆగస్టు వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. చేసిన పనులకు ఇప్పటివరకు నయా పైనా బిల్లు రాలేదని కాంట్రాక్టర్ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 1.60 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు
బిల్లులు రాకపోవడంతో
చేతులెత్తేసిన కాంట్రాక్టర్
త్వరలో నిధులు..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ మార్కెట్‌లో ఎంత వరకు పనులు జరగాయన్న విషయమై ప్రభుత్వం నివేదికలు సేకరిస్తోంది. త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి.
– మహేశ్‌కుమార్, ఎల్లారెడ్డి మున్సిపల్
కమిషనర్

అసంపూర్తిగా సమీకృత మార్కెట్