
సార్వత్రిక సమ్మె విజయవంతం
కామారెడ్డి టౌన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు పాలడుగు సుధాకర్ పేర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో జిల్లాకేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, ఏఐటీయూసీ నేతలు దశరథ్, బాల్‌రాజ్, ఆయా సంఘాల నాయకులు నర్సింలు, రాజనర్సు, వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.