
‘ఆత్మ’కు ఏమయ్యింది!?
ఎల్లారెడ్డి: వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పథకం నిర్వీర్యమవుతోంది. నిధులు లేకపోవడంతో ఆత్మ కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు.
పథకం ఇలా..
ఈ పథకం అమలు కోసం ఏడీఏ పరిధిని ఒక బ్లాక్‌గా నిర్ణయించారు. ప్రతి బ్లాక్‌కు ఒక చైర్మన్ ఉండేవారు. జిల్లా కమిటీలో జిల్లా చైర్మన్‌ను అనుసంధానంగా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉండగా, బ్లాక్ చైర్మన్‌కు అనుసంధానంగా ఏడీఏ ఉన్నారు. ఏడీఏ పరిధిలోని రైతులకు పలు అంశాలలో అవగాహన కల్పించేందుకు బ్లాక్ లెవల్ ఫార్మర్స్ అడ్వయిజరీ కమిటీలను ఏర్పాటు చేసేవారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని కల్పించేందుకు క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, సదస్సులు, పొలం బడులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల వద్దకు పర్యటనలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల వల్ల తెలుసుకున్న అంశాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఈ పథకంకోసం కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులను కేటాయించేవి. అయితే దశాబ్ద కాలంగా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.
మూస పద్ధతుల్లోనే సాగు..
అన్నదాతలకు ఉపయోగపడని పథకం
నిధులు కేటాయించి మనుగడలోకి తేవాలని కోరుతున్న రైతులు
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 5 లక్షలకు పైచిలుకు ఎకరాలలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో మూడు లక్షలకుపైగా ఎకరాలలో వరి పంటే సాగవనుంది. అది కూడా మూస పద్ధతుల్లోనే.. చాలావరకు రైతులకు అవగాహనలేక ఆధునిక సాగు పద్ధతులు అవలంబించడం లేదు. ఆత్మ పథకం క్రియాశీలకంగా అమలై ఉండి ఉంటే రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన ఏర్పడే అవకాశాలుండేవి. పాడి, కోళ్ల, గొర్రెల పెంపకంపైనా అవగాహన పెరిగేది. దీంతో వ్యవసాయం లాభదాయకంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ఆత్మలాంటి కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ఆత్మ పథకం నిధులు లేక ఉపయోగపడడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో ఈ పథకాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నారు.
– తిరుమల ప్రసాద్, డీఏవో