
ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. లెక్చరర్ల కొరత లేకుండా చూశామని, అడ్మిషన్లపైనా దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇంటర్ ప్రవేశాల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రవేశాలపెంపు, ఫలితాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..
6 వేల అడ్మిషన్లు లక్ష్యం..
ఈ విద్యాసంవత్సరంలో 6 వేల అడ్మిషన్ల లక్ష్యంతో సాగుతున్నాం. ఇందుకోసం లెక్చరర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో ఎస్సెస్సీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థిని కలిశారు. దీంతో ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 50 శాతం ప్రవేశాలు జరిగాయి. మిగిలిన లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత చదువుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అర్హులైన, అనుభవజ్జులైన అధ్యాపకులున్నారు. అర్హులకు స్కాలర్‌షిప్ కూడా వస్తుంది. ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువుంది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలి.
లెక్చరర్ల కొరత లేదు..
జిల్లాలో 242 మంది రెగ్యులర్ లెక్చరర్లతో పాటు 58 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని కళాశాలలకు చేరాయి. మధ్యాహ్న భోజనం పథకం గురించి ఇంకా ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు.
● ప్రభుత్వం సర్కారు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అవసరమైన మరమ్మతులు, భవనాల నిర్మాణం కోసం రూ. 3.28 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఈ నిధులలో కళాశాలు అభివృద్ధి కానున్నాయి. అలాగే విద్యార్థులకు క్రీడల కోసం ప్రతి కళాశాలకు రూ. 10 వేల చొప్పున నిధులు వచ్చాయి.
ఫీజుల విషయంలో..
ప్రణాళికబద్ధంగా..
గత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫలితాలు నిరాశకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి మంచి ఫలితాలను సాధించేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్నాం. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నాం. తరచూ వారితో సమావేశాలు నిర్వహించి, ప్రగతిని తెలుసుకుంటాం. అలాగే పది మంది విద్యార్థుల బాధ్యతను ఒక లెక్చరర్‌కు అప్పగించి వారిపై దృష్టిపెడతాం. ప్రతినెల ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి, మార్కులు తక్కువ వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈసారి విద్యార్థులకు ఏప్‌సెట్, జేఈఈ, ఐఐటీ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
ప్రభుత్వ కళాశాలల్లో
అడ్మిషన్ల పెంపునకు కృషి
రూ. 3.28 కోట్లతో కళాశాలల
అభివృద్ధికి చర్యలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా ఇంటర్
నోడల్ అధికారి షేక్ సలాం
ప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు రూపేణ ప్రథమ సంవత్సరానికి రూ. 1,760, ద్వితీయ సంవత్సరానికి రూ. 1,940 ఫీజు మాత్రమే వసూలు చేయాలి. వసతి, ఇతర సదుపాయాలు, ఆయా శిక్షణల కోసం కాలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ తీర్మానం మేరకు ఫీజులు వసూలు చేస్తే ఆ అంశం మా పరిధిలోకి రాదు. అనుమతులు ఒకచోట తీసుకుని, మరోచోట తరగతులు, కోచింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
ఈసారి జిల్లాలోని 20 కళాశాలల్లో అన్ని తరగతి గదుల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేశాం. వాటి సాయంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే తరగతులను మానిటరింగ్ చేస్తారు. జిల్లా కేంద్రం నుంచి నేను కూడా పర్యవేక్షిస్తా.

ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి