కామారెడ్డి అర్బన్: జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో మరింతగా ఆర్థికావృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు. సోమవారం శ్రీలక్ష్మి నర్సింహ జిల్లా మహిళా సమాఖ్య, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో కామారెడ్డి మండల సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళలు పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, మహిళా శక్తి క్యాంటిన్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతేడాది జిల్లాలో కొత్తగా 8,800 మంది సభ్యులుగా చేరారన్నారు. స్కూల్ యూనిఫాంలు కుట్టడం, కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం ద్వారా రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప తెలిపారు. 2025–26 ప్రణాళికలో భాగంగా పెట్రోలు బంక్‌లు, గోదాములు, రైస్ మిల్లులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ ద్వారా ఆదాయం పొందాలని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. రూ. 5 కోట్లతో చేపట్టిన జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. దివ్యాంగ, వృద్ధ, కిషోర మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని, మహిళలకు రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా కార్యదర్శి రాజమణి, కోశాధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.