
జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత
నిజాంసాగర్/బిచ్కుంద: వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి వద్ద నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మంత్రి మొక్కలు నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. బిచ్కుంద – డోంగ్లీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం బిచ్కుందలోని బండాయప్ప ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారం అనుభవించిన ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. బిచ్కుంద –కుర్లా వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 13.2 కోట్లు మంజూరు చేశామన్నారు. శాంతాపూర్ నుంచి దడ్గి వరకు రోడ్డుకు రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మేనూర్ నుంచి డోంగ్లీ వరకు రోడ్డుకు రూ. 7.5 కోట్లు, అన్నాసాగర్ నుంచి జుక్కల్ రోడ్డుకు రూ. 10 కోట్లు, జుక్కల్ నుంచి మద్నూర్ వరకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బిచ్కుంద, పిట్లం, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో 6 విద్యుత్ సబ్‌స్టేషన్లను మంజూరు చేయిస్తానన్నారు. బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయిస్తానన్నారు. త్వరలోనే జుక్కల్‌కు ముఖ్యమంత్రిని తీసుకువస్తానన్నారు.
హైలెవల్ బ్రిడ్జి ప్రారంభం
పిట్లం: తిమ్మనగర్ శివారులోని నల్లవాగుపై రూ. 4.86 కోట్లతో నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. పిట్లం మండలానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి స్థానిక నాయకులతో మాట్లాడారు.
గత ప్రభుత్వం అన్యాయం చేసింది..
గత ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అన్యాయం చేసిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆరోపించారు. నియోజకవర్గానికి అవసరమైన రోడ్లు, ప్రాజెక్టులు, సబ్‌స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. లెండి ప్రాజెక్టుతోపాటు నాగమడుగు ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు విఠల్‌రెడ్డి, మనోజ్ పటేల్, మల్లికార్జున్, భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రమేశ్ దేశాయ్, మల్లికార్జునప్ప షెట్కార్, వెంకట్‌రెడ్డి, నాగ్‌నాథ్ పటేల్, నాగ్‌నాథ్, షేక్ అజీం లాలా, గంగాధర్, రవి పటేల్, సాహిల్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
రెండుమూడేళ్లలో
రూపురేఖలు మారుస్తా
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నియోజకవర్గంలో
పలు అభివృద్ధి పనులు ప్రారంభం

జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత

జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత