
జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
నిజాంసాగర్: జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్య సేవలు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్ భగీరథ, అటవీ భూముల ఆక్రమణ, మహిళా సంఘాలకు రుణాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అదనపు సబ్‌స్టేషన్లు నిర్మించాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ కాల్వల నిర్మాణ పనులు, అవసరమైన భూ సేకరణ పనుల పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను ఈనెల 9 నాటికి అందిస్తే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించేలా చూస్తానన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, ట్రామా కేర్‌సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎంఎఫ్‌టీ నిధులను ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు వినియోగించాలని కలెక్టర్‌కు సూచించారు.
వంద పడకల ఆస్పత్రికి
ప్రతిపాదనలు పంపండి
సమీక్ష సమావేశంలో
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి