
అందరు ఉన్నా.. అనాథలా మృతి
జక్రాన్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడు వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా కుటుంబసభ్యులకు సమాచారం లేకపోవడంతో అనాథలా మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్(32) మేసీ్త్ర పని చేస్తుండేవాడు. అతడు కొన్నేళ్ల క్రితమే లింగంపేట్ మండలం నుంచి అర్గుల్ గ్రామానికి కుటుంబంతో వలస వచ్చి, జీవనం కొనసాగిస్తున్నాడు. గత నెల 28న రాత్రి అతడు జక్రాన్‌పల్లిలో స్నేహితుడిని కలిసి వస్తానని బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో మరుసటి రోజు తండ్రి ప్రభురాజ్యం జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందగా ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడు అశోక్‌గా గుర్తించి, ప్రభురాజ్యంకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఆస్పత్రికి చేరుకొని మృతిచెందినది తన కుమారుడే అని బోరున విలపించారు.
బైక్‌ను ఠాణాకు తరలించారు.. విచారణ మరిచారు..
ఆస్పత్రిలో వారం రోజులుగా ఎవరూ లేని అనాథలా చికిత్స పొందుతున్న అశోక్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. 28న రాత్రి జక్రాన్‌పల్లి సర్వీసు రోడ్డులో ఒక యువకుడు బైక్ అదుపుతప్పి కిందపడిపోగా చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మరుసటి రోజు పోలీసులు బైక్‌ను ఠాణాకు తరలించారు. అయితే ఆ ఘటనలో గాయపడ్డవారు ఎవరు? అని పోలీసులు వివరాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లయితే అతడు ప్రాణాలతో ఉండేవాడని అర్గుల్‌కు చెందిన ఓ మాజీ ప్రతినిధి పేర్కొన్నారు. అశోక్‌ను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ అతనికి సంబందించిన వ్యక్తులు లేకపోవడం వల్ల వైద్యులు సైతం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. స్వల్ప గాయాలైన వ్యక్తి మరణించడంపై అనుమానంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ‘సాక్షి’ జక్రాన్‌పల్లి ఎస్సైను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్ లిప్ట్ చేయలేదు.
గతనెల 28న రోడ్డు ప్రమాదంలో
గాయపడిన అశోక్
ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు
సమాచారమిచ్చిన అంబులెన్స్ సిబ్బంది
తమ కుమారుడు కనిపించడం
లేదని ఫిర్యాదు చేసిన తండ్రి
దర్యాప్తు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం
చికిత్స పొందుతూ మృతి