
మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయా శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఆరోపిస్తున్నారు. కలుపు మొక్కల నివారణకు వాడే ఒకే కంపెనీకి చెందిన లాడీస్ అనే మందును వ్యాపారులు వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారు. మండల పరిధిలోని చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు లాడీస్ మందును వేర్వేరు దుకాణాల్లో కొనుగోలు చేసి రసీదులు తీసుకున్నారు. రసీదులు చూసిన రైతులు ధరలో తేడా ఉండడంతో అవాక్కయ్యారు. ఓ దుకాణంలో లాడీస్ మందు లీటరుకు రూ.1,600 చొప్పున రెండు లీటర్లు కొనుగోలు చేశాడు. అదే మందును మరో దుకాణంలో లీటరుకు రూ.1,350 చొప్పున కొనుగోలు చేశాడు. ధరలో తేడాను గమనించిన రైతులు గురువారం భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు శంకర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. శంకర్‌రావు బాధిత రైతులతో పాటు మరికొందరి రైతులతో కలిసి అధిక ధరకు విక్రయించిన దుకాణానికి వెళ్లి యజమానిని ప్రశ్నించారు. ఒకే మందుకు ఇంత తేడా ఎలా ఉంటుందని రైతులను ఎందుకు దోచుకుంటున్నారని ప్రశ్నించారు. ఆ మందును రూ.1,600 కే విక్రయిస్తామని లేదంటే తాము నష్టపోతామని తెలిపారు. మరో దుకాణంలో రూ.1,350 కే విక్రయించాడు కదా ఆయన ఎందుకు నష్టపోడని ప్రశ్నించారు. లేదు మేవు ఎమ్మార్పీ ధక కంటే తక్కువకే విక్రయించాం.. ఆ మందు ఎమ్మార్పీ ధర రూ.2,200 ఉంటుందని సమాధానం ఇచ్చినట్లు భారతీయ కిసాన్‌సంఘ్ నాయకులు తెలిపారు. పురుగు మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు ఎమ్మార్పీ ధరలను అధికంగా అచ్చు వేసి వ్యాపారులకు రైతులను దోచుకునే అవకాశం కల్పిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేసి ఎమ్మార్పీ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎవరికి నచ్చిన ధరలకు వారు
విక్రయిస్తూ రైతులను
దోచుకుంటున్న వ్యాపారులు
కంపెనీల అచ్చు వేసి ఇష్టం
వచ్చిన ఎమ్మార్పీ ధరలతో
దోచుకునే అవకాశం

మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు