
అత్తను హతమార్చిన అల్లుడు
పిట్లం(జుక్కల్): రూ.1లక్ష కోసం అత్తను అల్లుడు హతమార్చిన ఘటన పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి(43)కి భర్త, కుమారుడు, కూతురు స్వప్న ఉన్నారు. స్వప్నకు అదే గ్రామానికి చెందిన బాగరాజుతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. ఈక్రమంలో లక్ష్మి కొన్ని నెలల క్రితం అల్లుడు అయిన బాగరాజుకు లక్ష రూపాయలను ఇచ్చింది. బాగరాజు ఇటీవల సాగు చేసిన జొన్న పంటను తన పేరుపై కొద్దిగా, అత్త లక్ష్మి పేరున కొద్దిగా విక్రయించాడు. దీంతో ఇద్దరి బ్యాంకు ఖాతాలలో జొన్నలు విక్రయించిన డబ్బులు పడ్డాయి. దీంతో లక్ష్మి అల్లుడికి గతంలో ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగింది. ఈ విషయంపై గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగగా, గ్రామస్తులు సర్ది చెప్పారు. అనంతరం లక్ష్మి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెను బాగరాజు అడ్డగించి కమ్మకత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. బాగరాజు తన అత్తను చంపేశాను పోలీసులకు లొంగిపోతున్న అని గ్రామ మాజీ సర్పంచ్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని చూడగా ఆమె అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇచ్చిన రూ.లక్ష తిరిగి ఇవ్వాలని
అడిగినందుకు ఘాతుకం

అత్తను హతమార్చిన అల్లుడు