
పసుపు రైతులకు క్షమాపణలు చెప్పాలి
సుభాష్‌నగర్: పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్‌ఎస్, 18 నెలలుగా కాంగ్రెస్ పసుపు రైతులకు ఏం చేయలేదని, వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లో పుట్టి పదేళ్లు అధికారంలో ఉండి కూడా పసుపు రైతులకు ఏం చేయలేదని విమర్శించారు. జీవన్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పసుపు రైతులు నామినేషన్ వేసి ఓడించిన విషయాన్ని కవిత మర్చిపోయిందా అని ప్రశ్నించారు. 18 నెలలు గడిచినా సుదర్శన్‌రెడ్డికి లెటర్ ప్యాడ్ లేదని, మరో ఎమ్మెల్యే భూపతిరెడ్డికి క్యాంపు కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుతో ప్రయోజనాలేంటో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వివరించారని, పక్కనే ఉన్న భూపతిరెడ్డికి అర్థం కాలేదా అని ప్రశ్నించారు. బోర్డుకు శాశ్వత కార్యాలయం కోసం జెడ్పీ ఆవరణలో 2 ఎకరాల స్థలం కావాలని కలెక్టర్‌కు లేఖ రాశామన్నారు. పసుపు బోర్డు క్రెడిట్ అర్వింద్‌కే దక్కుతుందని, విమర్శలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, గంగోనె సంతోష్, అనంత్‌రెడ్డి, నారాయణ యాదవ్, బద్దం కిషన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బోర్డు ఏర్పాటుతో కాంగ్రెస్,
బీఆర్‌ఎస్ నేతల అక్కసు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి