కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

May 27 2026 12:11 AM | Updated on May 27 2026 12:11 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన పోస్టులకు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ పిల్లి రమేష్‌ మంగళవారం తెలిపారు. కేజీబీవీ కోటనందూరు పాఠశాలలో పీఈటీ, సీఆర్‌టీ (సోషల్‌) పోస్టులు ఒకటి చొప్పున, తొండంగిలో సీఆర్‌టీ(సోషల్‌)పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జూన్‌ 5వ తేదీలోగా ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కాకినాడ సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌గా

డాక్టర్‌ ఉషాకిరణ్‌

కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ప్రయాగ ఉషాకిరణ్‌ నియమితులయ్యారు. ఆర్‌ఎంసీ ఫార్మకాలజీ విభాగాధిపతిగా కొనసాగుతున్న ఆయనను కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. డాక్టర్‌ ఉషాకిరణ్‌ 1984 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థి, కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అదే కళాశాలలో ఎండీ ఫార్మకాలజీ పీజీ చదివారు. హైదరాబాద్‌ నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డీఎం క్లినికల్‌ ఫార్మకాలజీ చేశారు. 1997లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు వచ్చారు. 2003లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 2011లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2013 నుంచి ఫార్మకాలజీ హెచ్‌వోడీగా బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు. ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న డాక్టర్‌ విష్ణువర్థన్‌ రాష్ట్ర డీఎంఈగా పదోన్నతి పొందడంతో డాక్టర్‌ ఉషాకిరణ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.

ఎయిడ్స్‌ నియంత్రణే లక్ష్యం

కాకినాడ క్రైం: జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నియంత్రణే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌, ఎ.సుకుమార్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.చలమయ్య అన్నారు. మంగళవారం కాకినాడలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎయిడ్స్‌ నియంత్రణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలో జిల్లాలో వ్యాధి తీవ్రతను నియంత్రించేందుకు దశలవారీగా కృషి చేయాలన్నారు. స్వల్పకాలిక లక్ష్యాల ద్వారా నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవచ్చని దిశానిర్దేశం చేశారు.

లింగంపర్తి విద్యార్థినికి

3వ ర్యాంక్‌

ఏలేశ్వరం: ఏపీ ఎడ్‌సెట్‌లో మండలంలోని లింగంపర్తి గ్రామానికి చెందిన ముద్రగడ తేజస్వి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించింది. చిత్తూరు లోని ద్రవిడియన్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. సోషల్‌ విభాగంలో తేజస్వీ ఈ ర్యాంక్‌ సాధించింది. సివిల్స్‌ సాధించడమే లక్ష్యమని ఆమె తెలిపింది.

డీఈఓ కావడమే లక్ష్యం

ఏపీ ఎడ్‌సెట్‌లో 9వ ర్యాంకర్‌ జయరాజు

సామర్లకోట: డీఈఓ కావడమే తన లక్ష్యమని వాస ంశెట్టి జయరాజు తెలిపాడు. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన జయరాజు ఏపీ ఎడ్‌సెట్‌లో 9వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి పద్మరాజు వ్యవసాయ కూలీ కాగా తల్లి గృహిణి.

ఓపెన్‌ స్కూలు

పరీక్షలు వాయిదా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 28న జరగాల్సిన పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూలు పరీక్షలు బక్రీదు కారణంగా వాయిదా వేసినట్టు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు జూన్‌ 2వ తేదీన జరుగుతాయన్నారు. టెన్త్‌ గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్ష, ఇంటర్‌లో ఆర్థిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్‌ థియరీ పరీక్షలను వచ్చే నెల 2కు వాయిదా వేసిన కారణంగా ప్రాక్టికల్‌ పరీక్షలు 7వ తేదీకి వాయిదా పడ్డాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement