ఇలాగైతే ఎలా పద్మావతీ! | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎలా పద్మావతీ!

May 22 2026 12:18 AM | Updated on May 22 2026 12:18 AM

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పారిశుధ్య పనుల కాంట్రాక్టు నిర్వహిస్తున్న పద్మావతి సంస్థ తీరుపై శానిటరీ సిబ్బంది నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య కాంట్రాక్టును తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా అన్నవరం దేవస్థానంలో కాంట్రాక్టును సుమారు రూ.10 కోట్లకు పొందింది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ, సత్రాల్లో దుప్పట్లు ఉతికించడం, విద్యుత్‌ ఉపకరణాల మరమ్మతుల వంటి పనులను ఈ సంస్థ చేయాలి. ఈ క్రమంలో కనీసం శానిటరీ మెటీరియల్‌ కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని సిబ్బంది విమర్శిస్తున్నారు. దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు మొదటి రకం ఫినాయిల్‌, సోపాయిల్‌ సరఫరా చేయాలి. కానీ, నాసిరకం మెటీరియల్‌ ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. దీనివలన శుభ్రత మాట ఎలా ఉన్నా, కనీసం మరకలు కూడా పోవడం లేదు వాపోతున్నారు. అలాగే, చీపుర్లు, ఇతర వస్తువులు కూడా తగినన్ని సరఫరా చేయడం లేదని అంటున్నారు.

సిబ్బందికి చేతి చమురు

● సత్యదేవుని వ్రత మండపాల్లో నూనె మరకలను కడగానికి నాణ్యమైన సోపాయిల్‌, యాసిడ్‌లు ఉపయోగించాలి. పద్మావతి సంస్థ ఇస్తున్న మెటీరియల్‌తో ఆ మరకలు పోవడం లేదు. దీంతో, సొంత సొమ్ముతో చవుడు కొని శుభ్రం చేయాల్సి వస్తోందని వ్రత మండపాల్లోని శానిటరీ సిబ్బంది వాపోతున్నారు. దీనికి గాను వారికి రోజుకు రూ.50 చొప్పున చేతి చమురు వదిలిపోతోంది. నాణ్యమైన మెటీరియల్‌ ఇవ్వాలని అడిగితే ఉద్యోగం తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.

● సత్యదేవుని ప్రసాదం తయారు చేసిన తరువాత నల్లగా మాడిపోయే ఇత్తడి కళాయిలను శుభ్రంగా కడగాలి. అయితే, పద్మావతి సంస్థ ఇస్తున్న మెటీరియల్‌తో కనీసం కళాయిల జిడ్డు కూడా వదలడం లేదు. దీనిపై ప్రసాదం సూపరింటెండెంట్‌ ప్రశ్నిస్తే నాణ్యమైన మెటీరియల్‌ ఇవ్వడం లేదని అక్కడ పని చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ విషయంపై పద్మావతి సంస్థ సూపర్‌వైజర్లను ప్రసాదం విభాగం సూపరింటెండెంట్‌ అడిగితే.. వారు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆ మహిళలు వాపోతున్నారు. పైగా తమకు వేతనాలు సైతం సకాలంలో చెల్లించడం లేదని శానిటరీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● దేవస్థానంలో హుండీల ద్వారా వార్షికాదాయం రూ.15 కోట్లు. అందులో సింహభాగం ఈ సంస్థకే చెల్లిస్తున్నప్పటికీ పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మంత్రికి ఫిర్యాదు చేసినా..

‘పద్మావతి’ సంస్థతో వస్తున్న సమస్యలపై గత నెల 12న అన్నవరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డికి పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేసి, నివేదిక ఇవ్వాలని ఆయన దేవదాయ శాఖ సీఈ శేఖర్‌ను ఆదేశించారు. అయినప్పటికీ సంస్థ పని తీరులో ఎటువంటి మార్పూ లేదని సిబ్బంది చెబుతున్నారు. పద్మావతి సంస్థ అధినేత భాస్కర నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉంది. గతంలో 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్‌ ద్వారా రెండేళ్లు, తన పలుకుబడి ఉపయోగించి మరో రెండేళ్ల పాటు దేవస్థానాల్లో శానిటరీ కాంట్రాక్టును ఆయన పొందారని చెబుతారు. తిరిగి 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే దేవస్థానాల్లో శానిటరీ కాంట్రాక్టు ఆయనకే దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థను ప్రశ్నించడానికి, చర్యలు తీసుకోవడానికి దేవస్థానం అధికారులు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రెండుసార్లు నోటీసులిచ్చాం

దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణపై పలు ఫిర్యాదులు రావడంతో పద్మావతి సంస్థకు రెండుసార్లు నోటీసులిచ్చాం. నాసికరం మెటీరియల్‌ ఇస్తున్న విషయాన్ని సిబ్బంది నా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాను. వారి పేర్లు బయటపెట్టను.

– నల్లం సూర్యచక్రధరరావు,

ఈఓ, అన్నవరం దేవస్థానం

అన్నవరం దేవస్థానంలో శానిటరీ

కాంట్రాక్ట్‌ సంస్థపై సిబ్బంది విమర్శలు

నాణ్యమైన మెటీరియల్‌ ఇవ్వడం

లేదని ఆరోపణ

గట్టిగా అడిగితే ఉద్యోగం

ఊడబీకుతామంటున్నారని ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement