రత్నగిరిపై నెల రోజుల్లో సెల్‌ టవర్‌ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై నెల రోజుల్లో సెల్‌ టవర్‌

May 22 2026 12:18 AM | Updated on May 22 2026 12:18 AM

అన్నవరం: రత్నగిరిపై నెల రోజుల్లోగా ఎయిర్‌టెల్‌ సెల్‌ టవర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. దేవస్థానంలో డిజిటల్‌ చెల్లింపులను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మొబైల్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో ఇంటర్నెట్‌ సరిగ్గా కనెక్ట్‌ అవక ఈ విధానంలో వివిధ సేవల టికెట్ల కొనుగోలుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ‘క్యాష్‌ ట్రబుల్‌’ శీర్షికన ఈ నెల 14న, ‘కష్టాలు ఆన్‌.. తరగని లైన్‌’ శీర్షికన ఈ నెల 20న ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. తాజాగా సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ను మెరుగు పరిచేందుకు వీలుగా ప్రకాష్‌ సదన్‌ సత్రం వెనుక స్థలంలో ఎయిర్‌టెల్‌ సెల్‌ టవర్‌ ఏర్పాటు చేస్తున్నామని ఈఓ తెలిపారు. ఈ స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. టవర్‌ ఏర్పాటుతో భక్తుల ఇబ్బందులు చాలా వరకూ తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఇతర సెల్‌ కంపెనీల టవర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈలు నూకరత్నం, రామకృష్ణ కూడా పాల్గొన్నారు.

25 నుంచి టెన్త్‌

సప్లిమెంటరీ పరీక్షలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఈ నెల 25 నుంచి జూన్‌ నాలుగో తేదీ వరకూ పదో తరగతి, ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఆర్‌ఓ టి.తిప్పేనాయక్‌ ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 22 కేంద్రాల్లో 4,405 మంది, ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పరీక్షలకు 8 కేంద్రాల్లో 1,386 మంది, ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలకు 11 కేంద్రాల్లో 3,119 చొప్పున విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్‌ క్యాంపు నిర్వహించాలన్నారు, విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత శాఖల అధికారులకు డీఆర్‌ఓ సూచించారు.

మట్టి మాఫియా బరితెగింపు

అక్కినీడి చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు

అధికారులతోనే ఘర్షణ

పిఠాపురం రూరల్‌: మండలంలోని గోకివాడ గ్రామంలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. స్థానిక అక్కినీడి చెరువులో రాత్రి వేళల్లో యథేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తోంది. చెరువు గట్లను సైతం తవ్వేసి ఉదయం వరకూ మట్టిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఏలేరు జేఈ శ్రీనివాసరావు పరిశీలించారు. అయితే, ఇక్కడ తవ్వకాలకు తమకు అనుమతులున్నాయంటూ మట్టి మాఫియా ఏకంగా అధికారులతోనే ఘర్షణకు దిగింది. ఈ నేపథ్యంలో మట్టి మాఫియాపై చర్యలు తీసుకుంటామని జేఈ చెప్పారు. భారీ స్థాయిలో మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారని ఫిర్యాదు చేసినా తహసీల్దార్‌ కానీ, వీఆర్‌ఓ కానీ స్పందించ లేదని గ్రామస్తులు విమర్శించారు. చెరువుల పునరుద్ధరణ అంటూ అధికారులు మాటలు చెబుతున్నారే తప్ప, వాటి పరిరక్షణకు ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు. మట్టి మాఫియాతో స్థానిక అధికారులకు సంబంధాలున్నాయని, అందుకే ఫిర్యాదు చేసినా కనీసంగా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

పరీక్షలు ప్రారంభం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు లాంగ్వేజ్‌ పేపర్‌–1 పరీక్ష నిర్వహించారు. ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో 2,948 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 317 మంది పరీక్ష రాయగా 15 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి కేశవరావు తెలిపారు. అలాగే, సెకండియర్‌ జనరల్‌ విభాగంలో 5,430 మంది హాజరు కాగా, 380 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 840 మంది పరీక్ష రాయగా, 135 మంది పరీక్షకు హాజరు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement