సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని, పెద్దాపురం నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో వివిధ పదవుల్లో నియమితులయ్యారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గొల్లపల్లి నూకరాజు (తుని), ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా బోడపాటి సతీష్ (తుని), బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా యాదల గోపీకృష్ణ (తుని), లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాగం కామేశ్వరరావు (పెద్దాపురం) నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధిష్టానం గురువారం నియామక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయా పదవుల్లో నియమితులైన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ కోరారు. మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తాళ్లరేవు, కాజులూరు, కరప, కాకినాడ రూరల్, పెదపూడి మండలాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను ఉదయం 10 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలన్నారు. పని ప్రదేశంలో శ్రామికులకు టెంట్లు, తాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అ నారోగ్యాలతో బాధ పడేవారు తప్పనిసరైతే తప్ప ఎండలో సంచరించరాదని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోను, ఏఎన్‌ఎంల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బస్టాపుల వద్ద ప్రజలకు నీడ కల్పించాలని కలెక్టర్ సూచించారు.
‘బాల పురస్కార్’కు
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ క్రైం: వచ్చే సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, నూతన ఆవిష్కరణలు, ధైర్యసాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలతో పాటు ఇతర అంశాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 18 ఏళ్ల లోపు బాలలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్న వారు https://awards.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు జూలై 31 తుది గడువని పీడీ తెలిపారు.
టైరు పంక్చర్..
పల్టీలు కొట్టిన కారు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
యలమంచిలి రూరల్: టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టిన ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మర్రిబంద గ్రామ సమీపాన పదహారో నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. యలమంచిలి రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెనుమళ్ల వెంకట నాగబుల్లి ప్రసాద్‌రెడ్డి (30), అతడి బంధువు మణికుమార్‌రెడ్డి విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్నారు. యలమంచిలి దాటిన తరువాత మర్రిబంద సమీపాన కారు టైరు పంక్చరైంది. దీంతో, వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి, పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రసాద్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్న మణికుమార్‌రెడ్డిని హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


