రూ.కోటితో భక్తులకు మౌలిక వసతులు | - | Sakshi
Sakshi News home page

రూ.కోటితో భక్తులకు మౌలిక వసతులు

May 22 2026 12:18 AM | Updated on May 22 2026 12:18 AM

అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు నిర్ణయం

పలు తీర్మానాలకు ఆమోదం

అన్నవరం: భక్తులకు సుమారు రూ.కోటితో మౌలిక వసతులు కల్పించాలని అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌బోర్డు) సమావేశం నిర్ణయించింది. చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన ప్రకాష్‌ సదన్‌లోని ట్రస్ట్‌ బోర్డు హాలులో గురువారం జరిగిన సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ముఖ్యమైన తీర్మానాలు

● భక్తులకు చల్లని తాగునీరు, వాష్‌ రూముల్లో మెరుగైన సదుపాయాల కల్పించాలి.

● సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, అంతకు మించి విరాళం ఇచ్చే భక్తులకు అన్నదానం బాండుతో పాటు సత్యదేవుని ఫొటో కూడా ఇవ్వాలి.

● రూ.22 లక్షలతో కేశఖండన శాల దిగువన పురుషులకు 40, సీ్త్రలకు 20 కలిపి మొత్తం 60 వాష్‌ రూములను అధునాతన శానిటరీ పరికరాలతో అభివృద్ధి చేయాలి.

● పశ్చిమ రాజగోపురం ఎదురుగా సెల్లార్‌లోని వాష్‌ రూములను రూ.11.48 లక్షలతో ఆధునిక శానిటరీ పరికరాలతో అభివృద్ధి చేయడానికి పిలిచిన లోయెస్ట్‌ టెండర్‌కు ఆమోదం.

● దేవస్థానం టోల్‌గేట్‌ వద్ద కళాశాల మైదానంలోని ఉచిత డార్మెటరీలు, వాటిల్లోని వాష్‌ రూముల మరమ్మతులకు రూ.7.02 లక్షల అంచనాతో పిలిచిన టెండర్లలో లోయెస్ట్‌ వచ్చిన దానికి ఆమోదం.

● రూ.17.52 లక్షల అంచనాతో వివిధ రోడ్ల మరమ్మతులకు పిలిచిన టెండర్లలో తక్కువగా కోట్‌ చేసిన దానికి ఆమోదం.

● విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయానికి గాను రెండు స్టాల్స్‌ ఏర్పాటుకు అనుమతి.

● భక్తులకు వ్రతం, ఇతర సేవా టికెట్లు విక్రయించేందుకు గాను ఒక్కొక్కటి రూ.90 వేలతో కియోస్కుల కొనుగోలు.

ఫ్లోరింగ్‌పై తెలుపు రంగు పెయింట్‌

పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న నేలపై కార్పెట్లు లేకపోవడంతో లారెస్‌ విశ్రాంతి షెడ్డు వద్ద దేవస్థానం బస్సులు ఎక్కే భక్తులు సీసీ రోడ్డుపై కాళ్లు కాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ‘కార్పెట్లు ఎక్కడ స్వామీ’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 10న కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ మర్నాడు అక్కడ కార్పెట్లు వేశారు. దీనికి కొనసాగింపుగా అక్కడ భక్తుల కాళ్లు కాలకుండా ఫ్లోరింగ్‌పై రూ.11 లక్షలతో తెలుపు రంగు పెయింట్‌ వేయించాలని ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement