సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిరో బుల్‌బుల్ పిట్ట’ అనే పాట మెట్ట ప్రాంత రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క శంకుస్థాపనతో పార్టీలో అందరి నోళ్లూ మూయించాలనుకుని టీడీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. గండేపల్లి మండలంలో రూ.52 కోట్లతో చేపట్ట తలపెట్టిన తాళ్లూరు ఎత్తిపోతల పథకం క్రెడిట్ అంతా జ్యోతుల ఖాతాలో పడాలని ఆయన వర్గం భావించింది. మంత్రి నారా లోకేష్‌తో శంకుస్థాపన చేయించి, తద్వారా అటు రైతుల్లోను, ఇటు జిల్లా రాజకీయాల్లోను పట్టు బిగించాలనేది నెహ్రూ వ్యూహం.
పార్టీపై పట్టు కోసం..
గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, లోకేష్ కోటరీలో అత్యంత నమ్మకస్తుడుగా పేరుబడ్డ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఇటీవల జిల్లా టీడీపీలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటుపై సానా, జ్యోతుల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. చివరకు పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. అప్పటి నుంచీ జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాళ్లూరు లిఫ్ట్‌కు లోకేష్‌తో భూమి పూజ చేయించి పార్టీపై పట్టు బిగించాలని, పార్టీ లోని ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని జ్యోతుల భావించారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేశారు. చినబాబుకు ఘన స్వాగతం, ఎత్తిపోతల పథకం భూమిపూజ, రైతులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కానీ, చివరి నిమిషంలో లోకేష్ పర్యటన రద్దయ్యిందంటూ పై నుంచి వర్తమానం రావడంతో జ్యోతుల వర్గం తీవ్ర నిరాశకు గురైంది.
అసలు కారణాలు అవేనా?
లోకేష్ పర్యటన రద్దుకు పార్టీ నేతలు ఏవేవో కారణాలు చెబుతుండగా అసలు విషయం వేరే ఉందనే చర్చ కూడా నడుస్తోంది. తాళ్లూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, గత సీజన్‌లోనే సాగునీరు అందిస్తామని రైతులకు గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జ్యోతుల హామీ ఇచ్చారు. ఆయన ఆ మాట ఇచ్చి రెండు సీజన్లు గడచినా చుక్క నీరు కూడా విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు సీజన్లకు పంట కోల్పోయిన మేరకు నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండుతో లోకేష్ పర్యటనలో ఆందోళనకు సిద్ధమని రైతులు ప్రకటించారు. రెండేళ్లుగా పూర్తి చేయని ఈ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసి, జూలై నాటికి సాగునీరందిస్తామంటూ జ్యోతుల చెప్పిన మాటలను రైతులు విశ్వసించడం లేదు. మరోవైపు గత ఎన్నికల్లో జ్యోతులపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రరావు ఎమ్మెల్యే నెహ్రూ హయాంలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇటీవల కొన్నాళ్లుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు వచ్చే లోకేష్ దృష్టికి జ్యోతుల అవినీతిని సాక్ష్యాధారాలతో తీసుకువెళ్తానని ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు బూరుగుపూడిలో మీడియా సమావేశంలో వెల్లడించారు. అదే సమయంలో టీడీపీ నాయకులు అక్కడకు వచ్చి గలాటా సృష్టించారు. ఈ సమస్యలతో పాటు రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే నిఘా వర్గాల సమాచారంతో తాళ్లూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమాన్ని లోకేష్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. అయితే, ఈ వ్యవహారం వెనుక ప్రత్యర్థి సానా సతీష్‌బాబు వర్గం పని చేసిందని జ్యోతుల వర్గం బలంగా విశ్వసిస్తోంది. కారణాలేవైనప్పటికీ లోకేష్ రాకపోవడంతో జ్యోతుల వర్గం డీలా పడింది.
ఫ లోకేష్ వస్తారని
జ్యోతుల వర్గం హడావుడి
ఫ రైతుల ఆందోళన భయంతో
చినబాబు వెనుకడుగు
ఫ ‘సానా’ రాజకీయమే
నడిచిందని సందేహాలు
రకరకాల ప్రచారాలు
లోకేష్ పర్యటన రద్దుపై రెండు రోజుల వ్యవధిలో రెండు కారణాలను టీడీపీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో అపాయింట్‌మెంట్ ఒక రోజు ఆలస్యం కావడంతో ఆయన తాళ్లూరు పర్యటన రద్దయ్యిందని తొలి రోజు ప్రచారం నడిచింది. 24 గంటలు గడిచేసరికి ప్రధాని మోదీ పొదుపు పిలుపుతో ఖర్చు తగ్గించేందుకే లోకేష్ పర్యటన రద్దయ్యిందని చెప్పుకొచ్చారు. జ్యోతుల కూడా ఇదే కారణమని అన్నారు. వాస్తవానికి ప్రధాని పొదుపు పిలుపు అంతకంటే ముందే రావడం గమనార్హం. లోకేష్ పర్యటన రద్దుతో ఇక చేసేది లేక జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఏసుబాబు, మెగా ఇంజినీరింగ్ ప్రతినిధుల సమక్షంలో తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి జ్యోతులనే స్వయంగా కొబ్బరి కాయ కొట్టి మమ అనిపించారు.
రెండు నెలల్లో అసాధ్యం
తాళ్లూరు లిఫ్ట్ ఆధునీకరణ ప్రారంభించినా ఈ పనులు రెండు నెలల్లో పూర్తయ్యి ఖరీఫ్‌కు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంతోనే మంత్రి లోకేష్ పర్యటన రద్దు చేసుకుని ఉండవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తాళ్లూరు లిఫ్ట్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు. రెండేళ్లుగా సాగునీరు లేక ఆయకట్టు రైతులు పూర్తిగా నష్టపోయారు.
– తోట నరసింహం, వైఎస్సార్ సీపీ జగ్గంపేట సమన్వయకర్త
తండ్రీ కొడుకుల అక్రమాలు బయటపడతాయనే..
జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు జ్యోతుల నవీన్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై మేము ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాం. మంత్రి లోకేష్‌ను కలిసి, ఈ అవినీతిని ఆయనకు వివరించాలనుకున్నాము. వారు చేస్తున్న అవకతవకలు బయట పడతాయనే ఉద్దేశంతో కావాలనే మంత్రి లోకేష్ పర్యటన రద్దు చేయించారు.
– పాఠంశెట్టి సూర్యచంద్రం, బూరుగుపూడి ్ఠ


