పిఠాపురం: నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందంటూ జనసేన నేతలు తెగ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తాను రూ.400 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ రూ.400 కోట్లలో ఉప్పాడ – పిఠాపురం రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) లెక్కలు సైతం చూపిస్తున్నారు. దీని నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే పూర్తి చేస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ, గద్దెనెక్కి దాదాపు రెండేళ్లవుతున్నా ఈ ఆర్‌ఓబీ నిర్మాణం ఒక్క అంగుళం కూడా జరగలేదు. దీంతో, ప్రయాణికులు ఇక్కడ నిత్యం నరకం చవి చూస్తున్నారు. గొప్పలు మాని, తమ ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిత్యం వేలాది వాహనాలు
పిఠాపురం నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే ప్రధాన రహదారిలో పిఠాపురం రైల్వే స్టేషన్ సమీపాన ఉప్పాడ రైల్వే గేటు ఉంది. ఇటు పిఠాపురం, అటు తుని, తొండంగి, కొత్తపల్లి మండలాలకు చెందిన వివిధ వాహనాలు నిత్యం ఈ గేటు మీదుగానే రాకపోకలు సాగిస్తూంటాయి. ఇక్కడికి సమీపంలోనే మాధవపురం, గోర్స రైల్వే గేట్లు కూడా ఉన్నప్పటికీ అధిక శాతం వాహనాలు ఉప్పాడ రైల్వే గేటు ద్వారానే వెళ్తూంటాయి. గతంలో కంటే రైళ్ల రాకపోకలు గణనీయంగా పెరగడంతో ఎప్పుడు చూసినా ఈ గేటు మూసే ఉంటోంది. ఒక్కోసారి రెండు మూడు రైళ్లు వెళ్లేంత వరకూ గేటు తీయకపోవడంతో ఇరువైపులా వందలాదిగా వాహనాలు అరగంట నుంచి గంట వరకూ నిలిచిపోతున్నాయి. దీంతో, ప్రయాణికులు, వాహన చోదకులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రైళ్లు వెళ్లాక ఆ ట్రాఫిక్ నుంచి బయట పడటానికి మరో అరగంటకు పైగా అగచాట్లు పడుతున్నారు. తీర ప్రాంత గ్రామాలకు ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉప్పాడ రైల్వే గేటు వద్ద ఆర్‌ఓబీ నిర్మించాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
గతంలోనే లైన్ క్లియర్
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ గతంలో కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడే ఒకేసారి నాలుగు రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. తుని, హంసవరం, మాధవపురం, గోర్స రైల్వే గేట్ల వద్ద వీటి నిర్మాణాలు పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి గేట్ల వద్ద పడుతున్న ఇబ్బందులకు ఆమె చాలా తక్కువ కాలంలోనే చెక్ పెట్టారు. అలాగే, ఉప్పాడ రైల్వే గేటు వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి కూడా ఆమె రైల్వే శాఖ నుంచి అనుమతులు తెచ్చి, అప్పట్లోనే రూ.150 కోట్లు మంజూరు చేయించారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు అవసరమైన అన్ని పక్రియలూ పూర్తి చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా అనుమతులు మాత్రమే రావాల్సి ఉన్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ఆర్‌ఓబీ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం పరిపాలనా అనుమతులు మాత్రమే ఇచ్చి, మొత్తం తామే చేసినట్లు చెప్పుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిఠాపురంలో ఉప్పాడ రైల్వే గేటు వేయడంతో నిలిచిపోయిన వాహనాలు
గంటల తరబడి గేటు వేసేయడంతో వాహనదారుల పడిగాపులు
నిత్యం నరకం
ఉప్పాడ రైల్వే గేటు ఒకసారి మూసేస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. రైలు వెళ్లాక గేటు తీసినా మళ్లీ వెంటనే వేసేయడం ఇక్కడ నిత్యకృత్యం. దీంతో పాటు తరచూ గేటు మరమ్మతులకు గురవడం, లాక్ అవడం వంటి సమస్యలతో గంటల తరబడి ఎండలోనే పడిగాపులు పడాల్సి వస్తోంది. కిలోమీటర్ల మేర నిలిపోయిన ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపే తిరిగి గేటు పడుతున్న సందర్భాలు కోకొల్లలు. దీంతో, ఈ రహదారిపై ప్రయాణం నిత్యం నరకంలా ఉంటోంది. ఇక్కడ వెంటనే ఆర్‌ఓబీ నిర్మించాలి.
– వేమగిరి వీరాస్వామి,
ప్రయాణికుడు, కొండెవరం
ఫ అంగుళం కూడా కదలని
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
ఫ చేసినట్లు గొప్పలు
చెప్పుకుంటున్న జనసేన నేతలు
ఫ గంటల తరబడి నిలిచిపోతున్న ట్రాఫిక్
ఫ పవన్ ఇలాకాలో
ప్రయాణికులకు నిత్యం నరకం


