బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సులో కాకినాడకు చెందిన ఇద్దరు నర్తకీమణులు నృత్య ప్రదర్శన చేయనున్నారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాల అధ్యక్షులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో మన దేశానికి చెందిన శాసీ్త్రయ కళారూపాలు ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా కాకినాడకు చెందిన నాట్యాచార్య కృష్ణకుమార్ శిష్యులైన చంద్రపు సౌమ్యరేఖ, కేతరాజు మనస్విని కృతి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు వారు బుధవారం అహ్మదాబాద్ బయలుదేరారు. వీరిద్దరూ దేశంలో ప్రఖ్యాతిగాంచిన నృత్యోత్సవాల్లోను, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్ దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ నృత్యోత్సవాల్లోను ప్రదర్శన ఇచ్చి కాకినాడ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారని కృష్ణకుమార్ చెప్పారు.
వచ్చే నెల 21 వరకూ
యోగా మాసం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో యోగాపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆయన బుధవారం ఆవిష్కరించారు. జిల్లా ఆయుష్ అధికారి మొహమ్మద్ ఆలీ మాట్లాడుతూ, బుధవారం నుంచి జూన్ 21వ తేదీ వరకూ యోగా మాసం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
సివిల్ సర్వీసెస్‌లో
పదేళ్లు పూర్తి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సివిల్ సర్వీసెస్‌లో చేరి బుధవారానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఉద్యోగులు సత్కరించారు. అపూర్వ భరత్ 2015లో సివిల్ సర్వీసెస్‌లో చేరారు. తొలుత న్యూఢిల్లీ డిఫెన్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో దేశానికి సేవలందించారు. 2020లో ఉత్తర ప్రదేశ్‌లో ఆర్‌డీఓ క్యాడర్‌లో పని చేశారు. 2021లో ఐఏఎస్ సాధించిన ఆయన ఏలూరులో ట్రైనీ కలెక్టర్‌గా, 2023–24లో సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్‌గా, 2024లో పోలవరం జిల్లా చింతూరు ప్రాజెక్టు అధికారిగా పని చేశారు. ఏడు నెలలుగా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అపూర్వ భరత్ విలేకర్లతో మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలనే సంకల్పంతో చదివానని అన్నారు.
1 నుంచి జిల్లాలో ‘సర్’
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) టి.తిప్పేనాయక్ తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం కింద యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ద్వారా ప్రస్తుతం నమోదై ఉన్న ఓటర్ల వివరాలను సర్–2002 డేటాతో పోల్చి చూస్తారని తెలిపారు. వారి బంధువుల వివరాలతో మ్యాచింగ్, లింకింగ్ చేస్తారమన్నారు. దీని ఆధారంగా అర్హులను, అనర్హులను నిర్ధారించి ఓటర్ల జాబితాను సవరిస్తారని వివరించారు. జిల్లాలో ఈ నెల 19వ తేదీ నాటికి 16,50,534 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,640 పోలింగ్ కేంద్రాలుండగా, రేషనలైజేషన్ అనంతరం వీటి సంఖ్యను 1,825కు పెంచేందుకు 81 కేంద్రాలకు లొకేషన్ మార్పు, 275 కేంద్రాలకు పేరు మార్పులను ప్రతిపాదించామని వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు డీఆర్‌ఓ సూచించారు.


