నిప్పుల కొలిమి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

కాకినాడ రూరల్‌/తుని రూరల్‌: మార్తాండుడు చండప్రచండంగా ప్రజ్వరిల్లుతూండటంతో వాతావారణం నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఇప్పటికే సూర్యుడు తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపుతూండగా.. బుధవారం మహోగ్ర రూపమే దాల్చాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైపోయింది. మధ్యాహ్నానికి కాకినాడ నుంచి తుని వరకూ పలు ప్రాంతాల్లో మంగళవారం 39 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ దాని ప్రభావం మాత్రం 46 డిగ్రీల స్థాయిని తలపించింది. బుధవారం కూడా కాకినాడలో 40.1, తునిలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ 50 డిగ్రీల మేర ఉన్నంత ప్రభావం చూపింది. దీనికి వేడి గాలులు, తీవ్రమైన ఉక్కపోత తోడవడంతో వాతావరణం అగ్నిగుండాన్ని తలపించి, ప్రజలు అల్లాడిపోయారు. దీంతో, ఎండ వేళ రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు పరుగులు తీసే 16వ నంబరు జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వాటి రాకపోకలు చాలా వరకూ తగ్గిపోయాయి. సోమవారం వరకూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వృద్ధులు చిన్న పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని ఎన్‌.సూరవరం పీహెచ్‌సీ వైద్యుడు రాజశేఖర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement