అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీల ఆదాయాన్ని రత్నగిరిపై బుధవారం లెక్కించారు. గడచిన 34 రోజులకు రూ.2,05,15,095 ఆదాయం వచ్చింది. ఇందులో నగదు రూ.1,93,89,456, చిల్లర నాణేలు రూ.11,25,639 ఉన్నాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వీటితో పాటు బంగారం 42.800 గ్రాములు, వెండి 954.500 గ్రాములు వచ్చాయన్నారు. అలాగే, అమెరికా డాలర్లు 40, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 25, ఒమన్ బైసా 800, సింగపూర్ డాలర్లు 2, మలేషియా రింగిట్స్ 12, కువైట్ దీనార్ 1, బ్రెజిల్ రియాస్ 4, ఖతార్ రియల్స్ 7, ఆస్ట్రేలియన్ డాలర్లు 10, హాంకాంగ్ డాలర్లు 20, భూటాన్ కరెన్సీ 16, బహ్రెయిన్ దీనార్లు 1.5, ఇండోనేషియా రూపాయలు 50,000, నేపాల్ రూపాయలు 70, నెగారా డాలర్లు 11 చొప్పున లభించాయని వారు వివరించారు. మొత్తం మీద హుండీల ద్వారా సగటున రోజుకు రూ.6,03,385 ఆదాయం సమకూరిందని చెప్పారు. నెల రోజులుగా స్వామివారి సన్నిధిలో వేలాదిగా వివాహాలు జరిగాయి. దీనికి తోడు ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు సత్యదేవుని దర్శనానికి వేలాదిగా తరలివచ్చారు. మరోవైపు విద్యా సంస్థలకు వేసవి సెలవులు, గత నెల 26 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలకు సైతం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ నెల రోజులూ ఆలయం కళకళలాడింది. దీంతో, స్వామివారికి ఆదాయం గణనీయంగా సమకూరింది.
ఫ సత్యదేవునికి
రూ.2.05 కోట్ల ఆదాయం
ఫ భారీగా విదేశీ కరెన్సీ


