పెట్రోమంటపై ప్రజాగ్రహం
● వినూత్నం..విభిన్నంగా ర్యాలీలు
● మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్‌లతో నిరసన
● పెంచిన ధరలు తగ్గించే వరకు
ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో అడ్డగోలుగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తోన్న చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అసలే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుచేయకుండానే అమలు చేశామంటున్న సీఎం చంద్రబాబు తీరుపై దాదాపు అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇందుకు పెట్రోలు, డీజిల్ ధరల మంట కూడా తోడవ్వడంతో ప్రజా భాగస్వామ్యంతో వైఎస్సార్ సీపీ సోమవారం తలపెట్టిన ఆందోళన జిల్లా అంతటా సూపర్‌సక్సెస్ అయ్యింది. తుని నుంచి మొదలు పెట్టి కాకినాడ నగరం వరకు కాకినాడ జిల్లా అంతటా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో హోరెత్తించారు. పెరిగిన పెట్రో ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం భరించాల్సింది పోయి దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో పెంచడంపై నిరసనాగ్రహం వ్యక్తమైంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఆందోళనా కార్యక్రమాలకు పల్లె, పట్టణం అనే వ్యత్యాసం లేకుండా వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సందోహంతో ఆందోళనలు సాగాయి. పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. వినూత్నమైన, విభిన్నమైన రీతిలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేయడం ప్రజలను ఆకర్షించింది.
కాకినాడ రూరల్
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. వైద్యనగర్‌లో క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి సర్పవరం జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ నిరసన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. తహసీల్దార్ కుమారికి పెట్రోలు ధరలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సుమారు రెండు గంటలపాటు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, ఎస్‌ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జీ, కరీంబాషా పాల్గొన్నారు.
కాకినాడ సిటీ
మాజీ ఎమ్మెల్యే, కాకినాడలో పార్టీ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి పార్టీ నేతలు పార్టీ సిటీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. అనతరం ఆర్డీఓ మల్లిబాబుకు వినతిపత్రాన్ని అందించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ మహిళ రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, జిల్లా ట్రేడ్ అధ్యక్షుడు చెక్కా చక్రవర్తి ర్యాలీలో పాల్గొన్నారు.
పెద్దాపురం
రాష్ట్రంలో జంట మున్సిపాలిటీలు కలిగిన పెద్దాపురం నియోజకవర్గంలో కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో సామర్లకోట వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వరకు ఎడ్ల బండిపై వచ్చి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలతో జనం అల్లాడిపోతున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఎడ్లబండి నిలిపి నిరసన తెలియజేసి ఆర్డీఓ భానుకు నేతలు వెంటరాగా దొరబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద పాసింజర్ ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, సీనియర్ నేత కంటే వీర రాఘవరావు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు కవరసాన సూరిబాబు, యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి కరణం భాను పాల్గొన్నారు.
జగ్గంపేట
స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై జగ్గంపేట తహసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీతో పాటు పెద్ద ఎత్తున రైతులు తీసుకువచ్చిన ట్రాక్టర్‌లతో మాజీ మంత్రి, నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట నరసింహం ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రాగా ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ వినూత్నంగా రైతులు ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. అనంతరం పార్టీ కోఆర్డినేటర్ తోట, నాయకులు తహసిల్దార్ జేవీఆర్ రమేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ ముఖ్యనేతలు రామకుర్తి జగాల్, పాటి రాంబాబు, కరుటూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పిఠాపురం
నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు పిఠాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, మత్స్యకారులు, స్థానికులు పెద్ద ఎత్తున ఉప్పాడ సెంటర్‌కు తరలివచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసిల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రాన్ని అందించారు. సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబి, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత పాల్గొన్నారు.
తుని
మండలంలోని ఎస్ అన్నవరం పార్టీ కార్యాలయం నుంచి మూడు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. డిప్యూటీ తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జి, తాండవ సుగర్స్ మాజీ చైర్మన్ నాగం దొరబాబు, పార్టీ మున్సిపల్ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణ గౌడ్, తుని తొండంగి మండలాల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, తుని పట్టణ శాఖ అధ్యక్షులు అన్న వరం శ్రీను ఆదోళనలో ఉన్నారు.ప్రత్తిపాడులో పెట్రో పెంపునకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రత్తిపా డు సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశా యి. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ఎం.సూర్యప్రభకు వినతి పత్రం అందజేశారు. రౌతులపూడి, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్నదివానం, రాజేశ్వరి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు పాల్గొన్నారు.
నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత ఆధ్వర్యంలో
పిఠాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
జగ్గంపేటలో ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న
నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తోటనరసింహం.
పెంపు పాపం చంద్రబాబుదే
పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు
ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు పాపం చంద్రబాబుదే. నాడు మా పాలనలో పెరిగితే జగన్ మోహన్‌రెడ్డి అసమర్ధ పాలన అన్న నాయకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారు. చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదు.అందులో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు.


