ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2026–27 విద్యాసంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఎంవీజే వర్మ సోమవారం తెలిపారు. కాకినాడ, జగ్గంపేట ప్రభుత్వ ఐటీఐలతో పాటు కోనసీమలో ఉన్న ప్రైవేట్‌ ఐటీఐలకు జూన్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 2వ తేదీలోగా సంబంధిత ఐటీఐలో తమ విద్యార్హతల సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884–2348182 నంబరులో సంప్రదించాలన్నారు.

భక్తజన సంద్రంగా రత్నగిరి

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. విద్యాసంస్థలకు వేసవి సెలవుల కారణంగా స్వామివారి సన్నిఽధికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీనికితోడు గత వారంలో వివాహాలు చేసుకుని స్వామివారి సన్నిధికి రాలేని దూర ప్రాంత భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సత్యదేవుని సన్నిధికి వస్తున్నారు. వీరంతా సత్యదేవుని దర్శించి స్వామివారి వ్రతాలాచరిస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మందికి అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధర్‌రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అలరించిన నృత్య ప్రదర్శనలు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్బంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో అమృతోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం రెడ్డి ఉమారాణి బృందం నృత్య ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. త్యాగరాజస్వామి రచించిన ’ఎందరో మహానుభావులు..’, అహల్య శాప విముక్తికి సంబంధించిన ’శ్రీరామ పాదమా..’, ‘నన్ను కన్న తల్లి నా భాగ్యమా..’ తదితర కీర్తనలకు నర్తించారు.బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన ’మహిషాసురమర్థిని...’ఘట్టానికి నృత్యాభినయం చేసి కరతాళ ధ్వనులు అందుకున్నారు. అనంతరం యూఎస్‌ఏకి చెందిన చింతలపాటి రూపారాజు కూచిపూడి నృత్యంతో అలరించారు. కోదండరామా, పట్టాభి రామా అనే త్యాగరాజ కీర్తనకు ఆమె అద్భుతంగా నర్తించారు. అనంతరం ఉమారాణి బృందం గోదా కల్యాణం రూపకం ప్రదర్శించారు. సమితి కార్యవర్గ సభ్యులు వాడ్రేవు వెంకట రమణారావు, సీఎస్‌ వెంకట్రావు, వక్కలంక శ్రీరామచంద్రం, విశ్వనాథం భాస్కర రామ్‌, వి.కృష్ణకుమారి, పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement