గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించడం సరికాదు

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: కేజీ బేసిన్‌లో అపారంగా లభ్యమవుతున్న సహజ వాయువు (గ్యాస్‌)ను చమురు సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలించడంపై ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కోనసీమ ప్రాంతం నుంచి అధిక మొత్తంలో చమురు, సహజ వాయువులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ. వందల కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నా ఈ ప్రాంతానికి మొండిచేయి చూపుతున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. కోనసీమలో గ్యాస్‌ ఉత్పత్తి జరుగుతున్న పట్టణాలు, గ్రామాల ప్రజలు నేటికీ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను అధిక ధరతో కొనుగోలు చేసే దుస్థితి ఉందని చెప్పారు. కేజీ బేసిన్‌ పరిఽధిలో ఇంటింటికీ గ్యాస్‌ను పైపులైన్ల ద్వారా సరఫరా చేసే పీఎన్‌జీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన లేదని ధ్వజమెత్తారు. స్థానికంగా లభ్యమయ్యే గ్యాస్‌ను ప్రజలకు తక్కువ ధరకు అందించే ఆలోచన ఉందా.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా ఉచిత గ్యాస్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి నుంచి ఇతర రాష్ట్రానికి తరలించుకుపోయిందన్నారు. గ్యాస్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement