అన్నవరం: సత్యదేవుని కల్యాణోత్సవం ఈ ఏడాది కూడా కళ కట్టలేదనే అభిప్రాయం భక్తుల నుంచి వస్తోంది. రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద తెరను సోమవారం రాత్రి 9 గంటలకే తీసి, స్వామి, అమ్మవారికి మేళతాళాల మధ్య హారతి ఇచ్చారు. అప్పటి నుంచి 9.30 గంటల వరకు కల్యాణం గురించి వ్యాఖ్యానం చెప్పించి, ఆ తరువాత ప్రారంభించారు. ఉత్సవానికి ఎమ్మెల్యేలెవ్వరూ హాజరవలేదు. కలెక్టర్ హరీంధిర ప్రసాద్ కూడా మంచి ముత్యాలు, పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లిపోయారు. అయినప్పటికీ సీట్ల విషయంలో గందరగోళం తప్పలేదు. చైర్మన్, ఈఓ, 16 మంది ట్రస్ట్‌బోర్డు సభ్యులు, నలుగురు ప్రత్యే ఆహ్వానితులు, ఒక జిల్లా జడ్జి మాత్రమే వీఐపీలుగా వచ్చారు. ముందు వచ్చిన వారిని ముందు వరుస, వెనుక వచ్చిన వారిని వెనుక అన్నట్టుగా కూర్చోపెట్టారు. ఆలస్యంగా వచ్చిన ఒకరిద్దరు ట్రస్ట్‌బోర్డు సభ్యులు సీట్లు దొరకక చాలాసేపు ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోవలసి వచ్చింది. కల్యాణ వేదిక మీద పుష్పాలంకరణ కాస్త నయమనిపించినా సత్యదేవుని ప్రధానాలయం లోపల, ఆలయం చుట్టూ తూతూమంత్రంగా బంతి, చామంతి పూలదండలు వేలాడతీశారు.
విద్యుత్‌కు అంతరాయం
స్వామివారి కల్యాణంలో ఎప్పుడూ విద్యుత్తు అంతరాయం అనేదే లేదు. కానీ, కల్యాణం జరుగుతున్న సమయంలో వేదిక మీద విద్యుద్దీపాలు రెండుసార్లు ఆరిపోయాయి. దీంతో, వేదిక ఎదురుగా ఉన్న ఫ్లడ్ లైట్ల వెలుగులోనే క్రతువు కొనసాగించారు. ఆ ఫ్లడ్‌లైట్లు కూడా రెండుసార్లు ఆరిపోయాయి. ఎల్‌ఈడీ స్క్రీన్లు కూడా కొంతసేపు మొరాయించాయి. కల్యాణ వేదిక ముందు విశ్రాంత షెడ్డులో అటూ ఇటూ అమర్చిన దీపాలు కూడా దోబూచులాడాయి. పశ్చిమ రాజగోపురం ముందున్న పందిళ్ల కింద, ఇంకా చాలాచోట్ల కూడా దీపాలు వెలగలేదు. ఈ పరిస్థితికి ఓవర లోడ్ కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే దేవస్థానంలో రెండేళ్ల క్రితం రూ.5 కోట్లతో సోలార్ ప్లాంటు పెట్టారు. అలాగే, దేవస్ధానానికి విద్యుత్ సరఫరా అయ్యేలా సబ్‌స్టేషన్ కూడా నిర్మించారు. అయినప్పటికీ ఇంకా ఓవర్ లోడు, లో ఓల్టేజీ అంటే ఎలాగనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంకా..
ఫ సత్యదేవుని కల్యాణోహోత్సవాలు జరిగే వారం రోజులూ రత్నగిరి, సత్యగిరులపై దేవస్థానం వైద్య సిబ్బంది, శంఖవరం పీహెచ్‌సీ సంయుక్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కల్యాణోత్సవ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. కానీ, కల్యాణోత్సవం జరిగిన రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ ఎక్కడ ఆ జాడే లేదు.
ఫ తలంబ్రాల పంపిణీ చేసేందుకు సన్నిధి కౌంటర్, ప్రసాదం కౌంటర్ రెండూ 60 అడుగుల దూరంలోనే ఏర్పాటు చేశారు. దీంతో, రెండు క్యూలు కలిసిపోయి గందరగోళం ఏర్పడింది.
ఫ ఈ నెల 30న జరిగే సత్యదేవుని రథోత్సవం, వచ్చే నెల 2న శ్రీపుష్పయాగం నాడు ఇటువంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
తలంబ్రాల కోసం తప్పని గందరగోళం
విద్యుత్ అంతరాయంతో కొద్దిపాటి వెలుగులోనే సత్యదేవుని కల్యాణం
ఫ సత్యదేవుని కల్యాణోత్సవ
నిర్వహణలో లోపాలు
ఫ విద్యుత్‌కు పలుమార్లు అంతరాయం
ఫ తలంబ్రాల కోసం తప్పని అవస్థలు


