బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ గోదామును కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి టి.తిప్పేనాయక్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల విభాగాల అధికారులను ఆదేశించారు. గోదాము పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని చెప్పారు.
పెట్రోలు బంకుల్లో జేసీ తనిఖీ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలోని పెట్రోలు బంకులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం తనిఖీ చేశారు. భానుగుడి జంక్షన్ వద్ద హెచ్‌పీసీఎల్, నూకాలమ్మ గుడి వద్ద ఐఓసీఎల్ బంకులను తనిఖీ చేసి, స్టాకు వివరాలపై ఆరా తీశారు. వినియోగదారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, కాకినాడలో ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులకు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఇంధన వనరుల సరఫరాలో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు.
సూర్య, చంద్రప్రభ
వాహనాలపై ఊరేగిన శ్రీవారు
ద్వారకా తిరుమల: చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ఆ దేవదేవుడిని కన్నులారా వీక్షించిన భక్తులు పులకించారు. తొలుత పంచాయుధాలను ధరించి, నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం అట్టహాసంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఉభయ దేవేరులతో శ్రీవారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. శ్రీహరి కళాతోరణ వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఆలయ ముఖ మండపంలో అహల్య శాప విమోచనం అలంకరణలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
పుష్కర భక్తులకు
సదుపాయాలపై దృష్టి
రాజమహేంద్రవరం సిటీ: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలూ కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మలతో కలసి నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల అధికారులతో విభాగాల వారీగా జరుగుతున్న ప్రాథమిక పనులు, అవసరమైన సౌకర్యాలు, ఘాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, భద్రతా చర్యలు, నగర సుందరీకరణ, ఘాట్లలో విద్యుద్దీపాలు, తాగునీరు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.


