ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం సాయంత్రం నవదంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు దర్బారు మండపంలో స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను తూర్పు రాజగోపురం ముందు ఆవరణలోకి పండితులు ఊరేగింపుగా తీసుకువచ్చి, అరుంధతి నక్షత్రాన్ని దర్శింపజేసి, పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ దిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై స్వామి, అమ్మవార్లను వేంచేయించి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తదితరులు పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దర్శించి, పూజలు చేశారు. అనంతరం, రావణబ్రహ్మ వాహనం ముందు కుంభపు రాశి వేశారు. తరువాత కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్‌ సెంటర్‌ వరకూ, తిరిగి తొలి పావంచా వరకు ఈ ఊరేగింపు సాగింది. కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామంలోకి భారీ వాహనాలను అనుమతించలేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు తరలివచ్చారు. ఊరేగింపు సాగినంతసేపు బాణసంచా కాల్చారు. ఒకవైపు ఊరేగింపు సాగుతుండగా మరోవైపు వాహనాల రాకపోకలు యథాతథంగా కొనసాగడంతో కొంత గందరగోళం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement