ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. పెట్రోలు, డీజిల్ కోసం ఇన్ని రోజులు వేచి చూడాల్సిన దుస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇదేం అన్యాయం? చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇంధన కొరత నివారణలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
– ముద్రగడ గిరిబాబు,
వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, ప్రత్తిపాడు
ఎక్కడా లేనిది మనకే ఎందుకు?
దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ లేని పెట్రోల్, డీజిల్ కొరత ఒక్క మనకే ఎందుకుంది? ఆయిల్ మాఫియా, బంకు యాజమాన్యాలు డీజిల్, పెట్రోలు కృత్రిమ కొరత సృష్టించి, వేలకు వేల లీటర్లు దాచుకుని లీటరుపై రూ.150 వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పెట్రోల్, డీజిల్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి.
– కర్నాకుల వీరాంజనేయులు,
ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇలాగైతే కష్టమే..
పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు సమీక్షలకే పరిమితమైతే సమస్య తీరదు. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థ స్తంభించి, అన్ని రంగాలపై భారం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన డీజిల్, పెట్రోల్ కొరత నివారణకు చర్యలు చేపట్టాలి.
– తాటిపాక మధు,
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ
వ్యాపారం పడిపోయింది
నేను చిన్నపాటి కిరాణా వ్యాపారం చేస్తుంటాను. డీజిల్ కొరత వల్ల కిరాణా సామగ్రి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హోల్‌సేల్ వ్యాపారులు కూడా సరకులు రావడం లేదని చెబుతున్నారు. వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు.
– ఎం.రమేష్‌బాబు, కిరాణా వ్యాపారి, పిఠాపురం


