అన్నవరం: ‘మాంగల్యం తంతునానేనా లోక రక్షణ హేతునా..’ అంటూ పండితులు గళమెత్తి సుస్వరంగా వేదమంత్రాలు పఠిస్తూండగా.. మంగళధ్వనులు, భక్తుల జయజయధ్వానాలు దిక్కులన్నిటా ప్రతిధ్వనిస్తూండగా.. జగత్కల్యాణ కారకులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రత్నగిరి వార్షిక కల్యాణోత్సవపై సోమవారం రాత్రి ఆద్యంతం భక్తజన సమ్మోహనంగా ఈ ఉత్సవం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు.
కల్యాణ క్రతువు సాగిందిలా..
వరుడు సత్యదేవుడిని వెండి గరుడ వాహనంపై, వధువు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి గజ వాహనంపై, పెళ్లి పెద్దలు సీతారాములను వెండి పల్లకీపై రాత్రి 7 గంటలకు కొండ దిగువన అన్నవరం గ్రామంలో ఘనంగా ఊరేగించారు. సీతారాములే పెళ్లి పెద్దలుగా వెంట రాగా, కల్యాణ వేదిక వద్దకు రాత్రి 9 గంటలకు వధూవరులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన సింహాసనంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను.. మరో ఆసనంపై సీతారాములను వేంచేయించారు. రాత్రి 9.08 గంటలకు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. రాత్రి 10.42 గంటల శుభముహూర్తంలో వధూవరుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. 10.50 గంటల సుముహూర్తంలో మంగళసూత్ర ధారణ గావించారు. 10.55 గంటలకు స్వామి, అమ్మవార్ల శిరస్సులపై అర్చకులు మంచి ముత్యాల తలంబ్రాలు పోశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరిగి ఊరేగింపుగా ప్రధానాలయానికి చేర్చారు. వేద పండితులు, ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు అంగర సతీష్, పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి తదితరులు కల్యాణ క్రతువు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్ పట్టు వస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. దేవస్థానం తరఫున చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు నూతన వస్త్రాలు సమర్పించారు. ఇంకా తిరుమల తిరుపతి, విజయవాడ కనక దుర్గమ్మ, ద్వారకా తిరుమల దేవస్థానాల తరఫున అక్కడి పండితులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేదిక వద్ద విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. కల్యాణోత్సవం సందర్భంగా సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
కల్యాణోత్సవం జరుగుతూండగా గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో, వేదిక మీద దీపాలు ఆరిపోవడం కొద్దిసేపు అసౌకర్యంగా అనిపించింది.
ఫ వైభవంగా సత్యదేవుని కల్యాణోత్సవం
ఫ తిలకించి, పులకించిన భక్తులు


