ఢీజిల్
కాకినాడలోని పెట్రోలు బంకు వద్ద డీజిల్ కోసం క్యూ కట్టిన ఆటోలు
ఫ ఆటోవాలాలకు ఇం‘ధన’ కష్టాలు
ఫ బంకుల్లో రూ.200 డీజిల్‌కే పరిమితి
ఫ దాని కోసం ఉదయం నుంచీ పడిగాపులు
ఫ ఇలాగైతే బతికేదెలాగంటూ ఆవేదన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజులు గడుస్తున్నా ప్రజలకు చమురు కష్టాలు తీరడం లేదు. ముఖ్యంగా అవసరమైనంత డీజిల్ దొరకక ఆటోవాలాలు, రవాణా వాహనదారులు దారుణమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. చమురు కంపెనీల నుంచి బంకులకు పూర్తి స్థాయిలో ఇంధనం సరఫరా కావడం లేదు. ఫలితంగా వాహనాలకు డీజిల్ అరకొరగానే లభిస్తోంది. దీంతో, తెల్లారింది మొదలు పెట్రోలు బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం నిత్యకృత్యంగా మారింది. గంటల తరబడి పడిగాపులు పడుతున్నా పరిమితంగానే డీజిల్ పోస్తూండటంతో ‘బతుకు బండి’ ముందుకు సాగడం లేదని వాహనదారులు ప్రధానంగా ఆటోవాలాలు ఆవేదన చెందుతున్నారు. ప్రభు త్వం తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడుతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు మాత్రం పెట్రోలు, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూండటం విమర్శలకు తావిస్తోంది.
అరకొరగా సరఫరా
జిల్లావ్యాప్తంగా ఉన్న 160 పెట్రోలు బంకులున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ సుమారు 7 లక్షల లీటర్ల పెట్రోలు, 8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతూంటాయి. చమురు కంపెనీల నుంచి ప్రతి బంకుకు రోజుకు 10 వేల లీటర్లకు తక్కువ కాకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేవి. కానీ, మూడు రోజులుగా డీజిల్ అరకొరగానే వస్తోంది. దీంతో, బంకుల వద్ద టిప్పర్లు, లారీలు, ఆటోలు పెద్ద ఎత్తున క్యూ కట్టాల్సిన దుస్థితి దాపురించింది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు సైతం దర్శనమిస్తున్నాయి. ఇంధన కొరతతో మూడింట ఒక వంతు బంకులను మూసివేసిన పరిస్థితి కనిపిస్తోంది.
‘ఆటో’ ఎటో!
అధిక శాతం ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు ఎక్కువగా ఆటోల పైనే ఆధారపడుతూంటారు. అటువంటి ఆటోవాలాలను డీజిల్ కొరత దారుణంగా దెబ్బ తీసింది. మూడు రోజులుగా డీజిల్ దొరకక బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయలేక ఆటోవాలాలు నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఇప్పటికే మూడింట ఒక వంతు ఆటోలు నిలిచిపోయాయి. కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, తుని, జగ్గంపేట, తుని తదితర ప్రాంతాల్లో డీజిల్ కొరత కారణంగా ఆటోలను నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా 13 వేలకు పైగా ఆటోలున్నా యి. ఒక్కో ఆటోవాలా రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకూ సర్వీసు చేస్తే ఖర్చులన్నీ పోనూ రూ.1,000 నుంచి రూ.1,500 వరకూ ఆదాయం పొందేవారు. స్థానికంగా రోజుకు 80 నుంచి 120 కిలోమీటర్ల వరకూ సర్వీసు చేసుకునేవారు. ప్రస్తుతం ఏ బంకుకు వెళ్లినా రోజుకు రూ.200కు మించి డీజిల్ పో యడం లేదు. దీంతో 40 కిలోమీటర్లకు మించి సర్వీసు చేయడం సాధ్యం కాదని, ఫలితంగా తమ ఆదాయానికి గండి పడిందని ఆటోవాలాలు వాపోతున్నారు. డీజిల్ కోసం వెళ్తే బంకుల్లో ఆరేడు గంటలు పడిగాపులు పడాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా ఆటోలు పూర్తి స్థాయిలో తిరగకపోవడంతో తమ ప్రయాణాలకు ప్రజలు నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు.
సహనం కోల్పోయి కొట్లాటలు
జిల్లాలో ఏ పెట్రోలు బంకుకు వెళ్లినా వాహన బారులు భారీగా కనిపిస్తున్నాయి. లీటరు పెట్రోలు, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్న వాహనచోదకులు కొన్నిసార్లు సహనం కోల్పోతున్నారు. కొన్నిచోట్ల కొట్లాటలకు దిగుతున్నారు. సామర్లకోట మండలం వీకే రాయపురం పెట్రోలు బంకులో డీజిల్ కోసం పోటీ పడి పిడిగుద్దులు గుద్దుకున్న సంఘటన డీజిల్ కొరత సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
చెత్త వాహనాలకూ సెగ
చివరకు కాకినాడ స్మార్ట్ సిటీలో చెత్త తరలింపు వాహనాలకు కూడా డీజిల్ సెగ తగిలింది. డీజిల్ కొరతతో నగర పాలక సంస్థ వాహనాలు రాకపోవడంతో కాకినాడ పెద్ద మార్కెట్‌లోని రోడ్డుపై రెండు రోజులుగా చెత్త గుట్టలా పేరుకుపోయింది. మార్కెట్‌లో అడుగు పెట్టలేని పరిస్థితి. మార్కెట్ అంతా దుర్గంధభరితంగా మారినా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రహసనంగా కూపన్ల పంపిణీ
వరి కోత యంత్రాలకు డీజిల్ కూపన్లు ఇవ్వాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్ణయించారు. మంగళవారం నుంచి కోతలు కోసే రైతులకు కూపన్లు ఇచ్చి 70 లీటర్ల వరకూ డీజిల్ అందించనున్నట్లు ప్రకటించారు. కోత యంత్రాలు కలిగిన రైతులు, కౌలు రైతులు నేరుగా మండల వ్యవసాయ అధికారులను, గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవెన్యూ సిబ్బందిని కలిసి కూపన్లు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియ ప్రహసనంగా మారిందని రైతులు ఆక్షేపిస్తున్నారు. ఉదాహరణకు కరప మండలంలో తహసీల్దార్ సహా అధికారులు సంతకాలు చేసి, సోమవారం 112 మందికి కూపన్లు ఇవ్వగా 78 మందికి మాత్రమే డీజిల్ సరఫరా చేశారు. మిగిలిన వారిని నో స్టాక్ అని చెప్పి తిప్పి పంపేశారు. దీంతో, నిరాశ చెందిన రైతులు.. బంకుల్లో డీజిల్ లేకుండా కూపన్లు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
వరి కోతలకు ఎఫెక్ట్
రబీ వరి కోతలపై కూడా డీజిల్ కొరత ప్రభావం చూపుతోంది. రబీలో జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఇప్పుడిప్పుడే కోతలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో సుమారు 550 వరి కోత యంత్రాలున్నట్లు అంచనా. పలువురు రైతులు వరి కోతలకు ఈ యంత్రాల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో డీజిల్ కొరత ఏర్పడటంతో యంత్రాలు పని చేయక.. మూడు రోజులుగా కోతలు నిలిచిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.


