ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా? | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా?

Apr 28 2026 7:29 AM | Updated on Apr 28 2026 7:29 AM

ఇన్ని రోజులైనా జాప్యమెందుకు?

ఎస్పీని మరోసారి కలసిన

వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య, అభూతకల్పనలతో ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ నెల 9న చేసిన వ్యాఖ్యలు, ప్రసారాలపై ఫిర్యాదు చేసినా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ఆ పార్టీ ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన పార్టీ నేతలు జిల్లా పోలీసు కార్యాలయం వరకూ సోమవారం ర్యాలీగా వెళ్లి ఎస్పీ గరికిపాటి బిందుమాధవ్‌ను కలిశారు. జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పోలీసు స్టేషన్లలోనూ రాధాకృష్ణపై ఫిర్యాదులు చేసి రెండు వారాలు గడచి పోయినా చర్యలు తీసుకోని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు స్వస్తి పలికే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న చంద్రబాబు కుట్ర పూరిత పాలనతో దాదాపు అన్ని వర్గాల ప్రజలూ విసుగెత్తిపోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు తోట నరసింహం, వంగా గీతా విశ్వనాథ్‌, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దవులూరి దొరబా బు, ముద్రగడ గిరిబాబు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్‌, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బెజవాడ సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌ కుమార్‌ (బన్నీ) తదితరులు పాల్గొన్నారు.

అన్నదానంలో సత్యదేవుని ప్రసాదం

అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భక్తులకు స్వామివారి గోధుమ నూక ప్రసాదం పంపిణీని సోమవారం ప్రారంభించారు. అన్నదాన భవనంలో తొలుత సత్యదేవుని చిత్రపటం వద్ద ప్రసాదాన్ని ఉంచి పండితులు పూజలు చేశారు. అనంతరం, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఇకపై ప్రతి రోజూ అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెడతామని వారు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని ప్రసాదం కూడా పెట్టాలని భక్తులు కోరుతున్న విషయాన్ని ‘అమాత్యా.. మొరాలకించవా..!’ శీర్షికన ఈ నెల 12న ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ ప్రస్తావించింది. అదే రోజు అన్నవరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కథనంపై స్పందించి అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని ఆదేశించారు. ఆ మేరకు ఈ నెల 24న జరిగిన ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో తీర్మానం ఆమోదించారు. అన్నదాన పథకంలో సోమవారం సుమారు 7 వేల మంది భక్తులకు అన్నప్రసాదంతో పాటు గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టారు. ప్రతి భక్తునికి సుమారు 15 గ్రాముల చొప్పున సుమారు 100 కిలోల ప్రసాదాన్ని అన్నదానంలో అందించినట్లు ఏఈఓ ఎల్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) ఆధ్వర్యాన మే 1 నుంచి 31వ తేదీ వరకూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) వి.సతీష్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిది నుంచి 16 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఈ శిబిరాలకు అర్హులన్నారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ శిక్షణ కొనసాగుతుందన్నారు. క్రీడల్లో ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న బాలబాలికలు క్రీడా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కాకినాడలోని డీఎస్‌ఏ కార్యాలయంలో లేదా 94400 31610 నంబరులో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement