‘ఉపాధి’ వేతన బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ వేతన బకాయిలు చెల్లించాలి

Apr 28 2026 7:29 AM | Updated on Apr 28 2026 7:29 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉపాధి కూలీలకు పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీరంగనాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ఈ మేరకు జిల్లా పరిషత్‌ సీఈఓ లక్ష్మణరావుకు వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఉపాధి కూలీల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులు చేసేచోట తాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, కూలీలకు నీడ కల్పించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తే కూలీలు వలస వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. నకిలీ మస్టర్లు అరికట్టి నిజాయతీగా పనులు జరిగేలా చూడాలని, గ్రామసభల ఆడిట్‌లో బయటపడిన అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం పూట మాత్రమే పనులు చేయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎటువంటి పనులూ లేకపోవడంతో నిరుపేదలు ఉపాధి పనులు మాత్రమే చేస్తున్నారని, నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్రీరంగనాయకులు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి జవ్వాది కృష్ణమాధవరావు, కార్యవర్గ సభ్యులు వై.సత్తిరాజు, ఎం.అప్పారావు, ఎన్‌.రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement