బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బంకుల్లో పెట్రోలు, డీజిల్ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతాయనే అపోహతో కొంత మంది అవసరం లేకున్నా అధికంగా పెట్రోలు, డీజిల్ స్టాకు పెట్టుకుంటున్నారని, దీనివలన బంకుల వద్ద రద్దీ పెరిగిందని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఈ రెండు రోజుల్లో సుమారు 50 నుంచి 60 శాతం మేర విక్రయాలు పెరిగాయన్నారు. వరి కోత యంత్రాల యజమానులకు రోజుకు 70 లీటర్ల డీజిల్ కూపన్లను గ్రామ వ్యవసాయ అధికారి, తహసీల్దార్ల సహకారంతో ఇస్తామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ నిల్వ చేసినా, లూజు విక్రయాలు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరం లేని వారు బంకుల వద్దకు రావద్దని సూచించారు. జిల్లాలోని 160 బంకుల్లో 15 వరకూ పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిందని కలెక్టర్ చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా పాల్గొన్నారు.


