శిథిల భవంతుల నీడన.. ఘోషపత్రి | - | Sakshi
Sakshi News home page

శిథిల భవంతుల నీడన.. ఘోషపత్రి

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

కాకినాడ క్రైం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పెద్దాసుపత్రిగా పేరొందిన కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్‌)లో రోగులకు సేవలందిస్తున్న మూడు భవనాలు ఏ క్షణమైనా కుప్ప కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. నిర్మించి 60 ఏళ్లు దాటడంతో ఈ భవనాల్లో వైద్య సేవలు, ఇతర కార్యకలాపాలు కొనసాగించడం ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని, వీటిని వెంటనే తొలగించాలని జేఎన్‌టీయూకే సివిల్‌ ఇంజినీర్లు 2024 జూలై 10న నివేదిక అందజేశారు. ఈ భవనాలను తొలగించి, కొత్తవి నిర్మించేందుకు రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదించినా ప్రభుత్వం ఏడాదిన్నరగా స్పందించడం లేదు. వైద్యులు, రోగులకు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఏటా రూ.కోటి మేర వృథా ఖర్చు చేస్తూ కేవలం ప్యాచ్‌ వర్కులతో సరిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్థి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చేస్తున్న ఈ పనులతో ఎటువంటి శాశ్వత ప్రయోజనమూ ఉండటం లేదు.

ఆ భవనాల్లోనే కీలక విభాగాలు

ఫ జీజీహెచ్‌లో ఓపీ, సర్జికల్‌, మెడికల్‌ భవనాలను జీ+2 పద్ధతిలో నిర్మించి 60 ఏళ్లయ్యింది. ఓపీ భవంతిని 1967లో 1,17,739.58 చదరపు అడుగులు, మెడికల్‌ భవంతిని 1968లో, సర్జికల్‌ భవంతిని 1969లో 1,77,726.69 చదరపు అడుగుల్లో నిర్మించారు.

ఫ ఓపీ భవనం కింది అంతస్తులో సాధారణ ఓపీ సేవలు, మెడికల్‌ స్టోర్‌లు, బ్లడ్‌ బ్యాంకు, రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్‌రే విభాగాలు.. మొదటి అంతస్తులో ఆసుపత్రి సూపరింటెండెంట్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలు, కమ్యూనిటీ హాలు, మినిస్టీరియల్‌ విభాగాలు, సీఎస్‌ ఆర్‌ఎంఓ, ఆర్‌ఎంఓ, అడ్మినిస్ట్రేటర్‌, ఏడీ, ఏఓ సహా కీలక అధికారుల కార్యాలయాలు, కంటి, చర్మ, చంటి పిల్లల వైద్య విభాగాలు ఉన్నాయి. అత్యంత బలహీనంగా ఉన్న రెండో అంతస్తులో కీలకమైన మెడికల్‌ రికార్డుల సెక్షన్‌ ఉంది. ఇక్కడికి నిత్యం వందలాది మంది వస్తూంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేదిక్కడే. ఇదే ఫ్లోర్‌లో ఓపీ ఎస్‌ఎస్‌ఆర్‌ గదులున్నాయి.

ఫ ఆసుపత్రికి గుండెకాయగా అభివర్ణించే ఈ భవనంలో ఎంఆర్‌డీ విభాగం వద్ద ఫ్లోర్‌ పగలడంతో కొద్ది రోజుల క్రితం మరమ్మతులు చేపట్టారు. ఆ క్రమంలో ఫ్లోర్‌ డ్రిల్లింగ్‌ చేస్తే మొత్తం భవనమంతటా ప్రకంపనలు వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కాక సిబ్బంది కంగారు పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫ మెడికల్‌, సర్జికల్‌ భవంతిలో మెడికల్‌, సర్జికల్‌, ఆర్థోపెడిక్‌, కార్డియాలజీకి చెందిన కీలకమైన సుమారు 25 వార్డులతో పాటు ఐసీయూలు, ఆపరేషన్‌ థియేటర్లు, విభాగాధిపతుల కార్యాలయాలు, సేవలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ విభాగాలు, సెమినార్‌ హాళ్లు, నర్సింగ్‌ స్టేషన్లు ఉన్నాయి.

ఫ ఒక విధంగా చెప్పాలంటే ఆసుపత్రిలోని కీలక విభాగాలన్నీ ఈ మూడు భవంతుల్లోనే ఉన్నాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ భవనాలు వర్షం వస్తే చాలు.. గోడలు నాని పడిపోతాయేమోననిపించేంత బలహీనంగా ఉన్నాయి. భవనంపై ఉన్న ట్యాంకుల నుంచి ఏళ్ల తరబడి నీరు లీకవుతూండటంతో గోడలు గుల్లబారిపోయాయి.

ఫ వీటితో పాటు గైనిక్‌, పీడియాట్రిక్స్‌, ఫ్యామిలీ ప్లానింగ్‌, ఐసోలేషన్‌, డీవీఎల్‌, ఏఆర్‌టీ కేంద్రం, క్యాన్సర్‌ ఓపీ, ఐపీ భవనాలు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. టీబీ వార్డు పరిస్థితి మరీ ఘోరం.

ప్రభుత్వానికి నివేదించాం

జీజీహెచ్‌లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను పరిశీలించాం. టీబీ వార్డు ఆవరణలో తాత్కాలిక భవంతి నిర్మించి, ప్రస్తుతం ఉన్న ఓపీ భవనం కార్యకలాపాలను అక్కడకు మార్చాలని, సర్జికల్‌, మెడికల్‌ భవంతుల్లోని ఐపీ సహా ఇతర విభాగాల తరలింపునకు అనుగుణంగా నిర్మాణం జరపాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్య కుమారి ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం.

– ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌,

కలెక్టర్‌, కాకినాడ

జీజీహెచ్‌లోని పీజీ వైద్యుల గదిలో ఉన్న వాష్‌రూమ్‌ పెచ్చులూడి పడటంతో ఎంతో గట్టిగా ఉన్న కమోడ్‌ తునాతునకలైంది.

క్యాన్సర్‌ ఓపీ భవంతి పీజీ రూములో సీలింగ్‌ పెచ్చులూడి పడి గదిలోని మంచాలు సహా ఇతర వస్తువులు దెబ్బ తిన్నాయి. ఈ రెండు సందర్భాల్లో అక్కడ వైద్య విద్యార్థులు ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.

సర్జికల్‌ భవంతిలో ఆహారం కోసం వేచి చూస్తున్న రోగుల బంధువుల నెత్తిన సీలింగ్‌ చిట్లి శిథిలాలు పడబోతే ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.

మెడికల్‌ వార్డులో సీలింగ్‌ పెచ్చులూడి మంచంపై పడటంతో అప్పటికే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ రోగి మళ్లీ గాయాలపాలయ్యారు.

ఫ ప్రమాదకర పరిస్థితుల్లో జీజీహెచ్‌

ఫ 60 ఏళ్ల కిందట ఓపీ, సర్జికల్‌, మెడికల్‌ భవనాల నిర్మాణం

ఫ కాలం చెల్లిన భవనాల్లోనే

నేటికీ కాలక్షేపం

ఫ 2024లోనే పరిశీలించిన జేఎన్‌టీయూకే సివిల్‌ ఇంజినీర్లు

ఫ తక్షణం తొలగించాలని సూచన

ఫ అయినా పట్టించుకోని ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement