కల్యాణోత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

కల్యాణోత్సవాలకు శ్రీకారం

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడే వరుడైన వేళ.. సిరులొసంగే దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వధువైన మహత్తర సన్నివేశాన్ని కన్నులారా తిలకించి, భక్తులు పులకించిపోయారు. సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై పండితులు శ్రీకారం చుట్టారు. రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాములు పెళ్లి పెద్దలుగా వెంట రాగా.. సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వేదికపై ప్రత్యేక ఆసనం మీద సత్యదేవుడు, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను వేంచేయించి, ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారిని, స్వామివారిని వధూవరులను చేశారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పసుపు దంచే రోలు, రోకళ్లకు పండితులు పూజలు చేసిన అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువలు పసుపు దంచారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ ఘనంగా నిర్వహించారు. పండితుల చతురోక్తులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుని కల్యాణోత్సవానికి సుమారు 25 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. భక్తుల వాహనాలను కొండ దిగువన కళాశాల మైదానం వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి కొండ మీదకు చేరేందుకు ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కల్యాణ ఏర్పాట్లను చైర్మన్‌, ఈఓ సమీక్షించారు.

అన్నవరంలో నేడు

తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ

ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ

ఉదయం 9.00 : అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, దీక్షా వస్త్రధారణ

రాత్రి 7.00 : కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామివారు. వెండి గజవాహనంపై అమ్మవారు, వెండి పల్లకీపై సీతారాముల ఊరేగింపు

రాత్రి 9.30 : రత్నగిరి కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం

ఫ రత్నగిరి కళావేదిక పైన, కొండ దిగువన ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు.

ఫ వధూవరులుగా అమ్మవారు, సత్యదేవుడి అలంకరణ

ఫ రత్నగిరిపై కన్నుల పండువగా వేడుక

ఫ నేటి రాత్రి స్వామివారి కల్యాణం

Advertisement
 
Advertisement
Advertisement