కాకినాడ రూరల్: సందర్శకులకు ఇబ్బందులు కలకుండా బీచ్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సూర్యారావుపేట బీచ్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీచ్‌లో సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.
స్వీయ గణనలోభాగస్వాములు కావాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వీయ గణన(సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి జెడ్పీ సెంటర్, టూటౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ వరకూ ఆదివారం నిర్వహించిన 5కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 30 వరకూ జిల్లాలోని ప్రతి పౌరుడూ స్వీయ గణన నమోదు చేసుకోవాలని కోరారు. ఇంటింటా జనగణ నమోదు కార్యక్రమం మే 1 నుంచి 30వ తేదీ వరకూ జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకున్నారని చెప్పారు.
నిధులు విడుదల చేస్తేనే పనులు ముందుకు..
తేల్చి చెప్పిన ఊడిమూడిలంక వంతెన కాంట్రాక్టర్
పి.గన్నవరం: మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై రూ.71.43 కోట్లతో చేపట్టిన వంతెన పనులకు సంబంధించి రూ.14 కోట్ల మేర పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే, పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం వంతెన పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతీ రాజ్ చీఫ్ ఇంజినీర్ శివకుమార్‌కు అసోసియేట్ ఇంజినీర్స్ ఎంటర్‌ప్రైజెస్ (కాంట్రాక్టర్) పీఎస్ రాజు తేల్చిచెప్పారు. గతంలో రూ.22 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన రూ.14 కోట్లు విడుదల చేయకపోవడంతో అతి ముఖ్యమైన వేసవి కాలాన్ని వినియోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిధుల విడుదలకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే లంకలో అబెక్ట్‌మెంట్ వాల్ నిర్మాణం కోసం 14 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని సమకూర్చాలని కోరారు. మొత్తం 9 పిల్లర్లు, రెండు అబెక్ట్‌మెంట్ వాల్‌లతో వంతెనను నిర్మిస్తున్నారు. ఇంత వరకూ 50 శాతం పనులు పూర్తి అయ్యాయని పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు సీఈకి వివరించారు. వంతెన పూర్తయితే ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కష్టాలు తొలగుతాయని ఆయన తెలిపారు. పనుల ప్రగతిని ఆయన ఎస్‌ఈకి వివరించారు. వంతెన నిర్మాణాన్ని సీఈ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ పి.రామకృష్ణం రాజు, జేఈ సంపన్న దుర్గా కొండలరావు పాల్గొన్నారు.


