చమురు..చుక్కలే.. | - | Sakshi
Sakshi News home page

చమురు..చుక్కలే..

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా అని వాహనదారులకు చమురు.. చుక్కలు చూపిస్తోంది. తగినంతగా పెట్రోలు, డీజిల్‌ సరఫరా లేకపోవడం.. అవసరానికి దొరకదేమోననే ఆందోళనతో వాహనచోదకులు పెట్రోలు బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. లీటర్‌ పెట్రోలు కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ ఏ బంకులో ఉంటే అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం శనివారం జిల్లావ్యాప్తంగా కనిపించింది.

మూత పడుతున్న బంకులు

జిల్లాలో 160 పెట్రోల్‌ బంకులుండగా.. అక్కడి సిబ్బంది చెబుతున్న దానిని బట్టి ప్రస్తుతం ఏ ఒక్క చోటా ఒక్క చుక్క కూడా డీజిల్‌ లేదు. పెట్రోల్‌ కూడా అరకొరగానే దొరుకుతోంది. దీంతో, ఆందోళన చెందుతున్న వినియోగదారులు పెట్రోలు కోసం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కాకినాడలో ఏ బంకు వద్ద చూసిన ఇదే పరిస్థితి. రెండు మూడు లీటర్ల పెట్రోలు కోసం సుమారు మూడు నాలుగు గంటలు క్యూలో నిలబడుతున్న పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌ సమీపాన పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న పెట్రోలు బంకు శనివారం ఉదయమే మూతపడిపోయింది. వాస్తవానికి శుక్రవారం నుంచే పెట్రోలు, డీజిల్‌ సరఫరా లేకపోవడం, ఉన్న స్టాక్‌ అయిపోవడంతో జిల్లావ్యాప్తంగా సగం బంకులను మూసివేశారు.

స్టాక్‌ రాక..

జిల్లావ్యాప్తంగా అన్ని బంకుల ద్వారా ప్రతి రోజూ 7 లక్షల లీటర్లకు పైగా డీజిల్‌, 8 లక్షల లీటర్లకు పైగా పెట్రోలు అమ్మకాలు జరుగుతాయి. మామూలుగా ప్రతి బంకుకూ రోజుకు 10 వేల లీటర్ల పెట్రోలు, 10 వేల లీటర్ల డీజిల్‌ సరఫరా జరిగేది. ప్రజలకు కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉండేది. శుక్రవారం నుంచి శనివారం వరకూ ఆయా బంకులకు రావాల్సిన స్టాక్‌ రాలేదు. దీంతో, ఉన్న స్టాక్‌ అంతా అయిపోయింది. ఈలోగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలు రావడంతో బెంబేలెత్తిన వినియోగదారులు ఇంధనం కోసం బంకుల వద్దకు ఎగబడ్డారు. ఫలితంగా ఉన్న స్టాక్‌ మరింత వేగంగా అమ్ముడుపోవడంతో జిల్లావ్యాప్తంగా చమురుకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. కొన్ని బంకుల్లో ఒక్కొక్కరికి ఒకటి రెండు లీటర్లు మాత్రమే పెట్రోలు కొడుతున్నారు. ఆటో, కార్లకై తే 5 నుంచి 10 లీటర్లు మాత్రమే డీజిల్‌ పోస్తున్నారు. దీనిపై అడిగితే, పౌర సరఫరాల అధికారుల ఆదేశమని బంకుల యజమానులు చెబుతున్నారు.

డీజిల్‌ కొరతతో ఇక్కట్లు

కాకినాడలో శనివారం ఉదయం ఏ బంకులోనూ డీజిల్‌ లభించలేదు. డీజిల్‌ అయిపోయిందని బంకుల నిర్వాహకులు చెప్పడంతో హతాశులైన వాహన యజమానులు ఉసూరుమని వెనుతిరిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. డీజిల్‌ కొరత తమ ఉపాధిని దెబ్బ తీస్తోందని ఆటోల యజమానులు వాపోతున్నారు. ఏ బంకుకు వెళ్లినా డీజిల్‌ దొరకడం లేదని, ఆటో నడపకపోతే కుటుంబాలను ఏవిధంగా పోషించుకోగలమని వారు ఆవేదన చెందుతున్నారు.

నిలిచిన వరి కోతలు

జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. ప్రస్తుతం ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి. పలువురు రైతులు యంత్రాలతో వరి కోతలు కోయిస్తున్నారు. వీటికి అవసరమైన డీజిల్‌ లభించకపోవడంతో వరి కోతలు సైతం నిలిచిపోయాయి. వరి కోత యంత్రాలను పెట్రోలు బంకుల వద్దకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. వాటికి టిన్నుల ద్వారానే డీజిల్‌ పోయాలి. ఏదైనా బంకులో డీజిల్‌ ఉన్నా 5 నుంచి 10 లీటర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. ఇది అరకొరే కావడంతో వరి కోతలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు గత్యంతరం లేక బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు డీజిల్‌ కొనుగోలు చేస్తున్నారు. వరి కోత యంత్రాలకు గతంలో ఎకరాకు రూ.2,500 అద్దె ఉండేది. డీజిల్‌ కొరత, బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా అది ఇప్పుడు రూ.3 వేలకు పెరిగింది.

యథేచ్చగా బ్లాక్‌ మార్కెట్‌

కొంత మంది బంకుల యజమానులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే టిన్నులతో పెట్రోలు, డీజిల్‌ పక్కదారి పట్టించేసి, బ్లాక్‌ చేసేశారు. ఎవరైనా అర్జెంట్‌ అని అడిగితే లీటరు పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు పెట్రోలు, డీజిల్‌ లేదని చెప్పేస్తున్నారు.

ఆర్టీసీకి ఓకే..

మార్కెట్లో డీజిల్‌ కొరత ఉన్నప్పటికీ ఆర్టీసీకి ఎటువంటి ఇబ్బందీ లేదని జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తమ డిపోలోని బంకులో తగినంత డీజిల్‌ అందుబాటులో ఉందని, నిరంతరాయంగా బస్సులు తిప్పేందుకు ఇబ్బంది లేదని చెప్పారు.

నాగమల్లితోట జంక్షన్‌ వద్ద ‘బంక్‌ క్లోజ్డ్‌’ అంటూ బోర్డు

కుటుంబాన్ని ఎలా పోషించాలి?

నాకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలీదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరిగినా నగరంలో ఏ బంకులోనూ డీజిల్‌ దొరకలేదు. రోజుకు రూ.700 సంపాదించేవాడిని. ఈ రోజు డీజిల్‌ లేకపోవడంతో బేరాలకు వెళ్లలేకపోయాను. కుటుంబాన్ని ఎలా పోషించాలి? చాలినంత డీజిల్‌ ఇవ్వకుండా ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది.

– అనిల్‌ కుమార్‌, ఆటో డ్రైవర్‌

డీజిల్‌ నిల్‌

పెట్రోలు కోసం ఎగబడుతున్న వాహనదారులు

బంకుల వద్ద భారీ బారులు

మూత పడుతున్న బంకులు

పట్టించుకోని ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement