● దొడ్డిగుంట అక్రమ అరెస్టులపై
వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం
● కార్యకర్తలకు అండగా ఉంటాం
● మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి భరోసా
● పార్టీ నేతలు వెంకట్రావు,
వీరబాబులకు రిమాండు
సామర్లకోట: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందనడానికి రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో జరిగిన అక్రమ అరెస్టులే నిదర్శనమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. దొడ్డిగుంటలో శుక్రవారం అరెస్టు చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక మత్స్యకార సంఘం నాయకులు మడికి వెంకట్రావు, చెల్లుబోయిన వీరబాబులను పోలీసులు శనివారం పెద్దాపురం కోర్టుకు తీసుకుని వచ్చారు. వారికి మద్దతుగా వచ్చిన జక్కంపూడి రాజా పెద్దాపురంలో విలేకర్లతో మాట్లాడారు. కిడ్నాప్ అయ్యారని పోలీసులు చెబుతున్న వారు తమనెవరూ కిడ్నాప్ చేయలేదని, సొంత పనులపై బయటకు వెళ్లామని స్వయంగా న్యాయమూర్తి ఎదుటనే వారు చెప్పారని అన్నారు. అయినప్పటికీ పోలీసులు తప్పుడు సెక్షన్లతో ఇష్టం వచ్చిన కేసు నమోదు చేశారని, దీని వెనుక వెంకట్రావు, వీరబాబులను ఏవిధంగా అరెస్టు చేయాలనే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో కుప్పలుతెప్పలుగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలను తప్పుదారి పట్టించడానికే వైఎస్సార్ సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. దొడ్డిగుంట మత్స్యకార సంఘ ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయమనే భయంతోనే అక్కడి వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేశారని ఆయన చెప్పారు. అక్రమ అరెస్టులపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని కూటమి నేతలు భరించలేకపోతున్నారన్నారు. సంఘంలో ఉన్న కొంత మంది సభ్యులు ఊరికి దూరంగా ఉంటే.. వారిని కిడ్నాప్ చేసినట్లు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. తమ నాయకులను పోలీసులు దౌర్జన్యంగా కొట్టారన్నారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నిస్తే తమకేమీ తెలియదంటూ పోలీసులు వ్యంగ్యంగా బదులిచ్చారని, ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పని చేసే పోలీసులు తగిన ఫలితం అనుభవించక తప్పదని రాజా హెచ్చరించారు.
ఈ దారుణాలను అందరూ గమనిస్తున్నారు
అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలను అందరూ గమనిస్తున్నారని అన్నారు. తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, పార్టీ మూడు జిల్లాల అధ్యక్షులు, నాయకుల పోరాటంతో పోలీసులు దిగి వచ్చారని చెప్పారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడికి లొంగి పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేసే వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లెవ్వరినీ రానివ్వకుండా చేసి, పోలీసులే ఓట్లు వేశారని, ఇక్కడ కూడా అదే విధంగా చేయాలనే కుట్ర పన్నుతున్నారని, దీనిలో భాగమే ఈ అక్రమ కేసులని చెప్పారు. తప్పుడు కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని, టీడీపీ నాయకుల కలలు నెరవేరవని అన్నారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పెద్దాపురం కోర్టు వద్దకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు కూడా వచ్చారు. విలేకర్ల సమావేశంలో పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరికీ రిమాండు
రంగంపేట: కిడ్నాప్ కేసులో అరెస్టు చేసిన ఇద్దరికి పెద్దాపురం కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారని ఎస్సై శివప్రసాద్ శనివారం స్థానిక విలేకర్లకు ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన మడికి వెంకట్రావు (లాజరు), చెల్లుబోయిన వీరబాబు, మరికొంత మంది ఈ నెల 23వ తేదీ రాత్రి 11.30 గంటలకు అదే గ్రామానికి చెందిన విత్తనాల బూరయ్య ఇంటికి వెళ్లారు. ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని బెదిరించారు. తనకు నచ్చిన వారికి ఓటు వేస్తానని చెప్పడంతో బూరయ్యను, అతడి భార్య సూరమ్మను కొట్టి చంపేస్తామంటూ వెంకట్రావు, వీరబాబులు బెదిరించారు. బూరయ్యను కాలర్ పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. బూరయ్య ఆచూకీ కనిపించకపోవడంతో అతడి భార్య సూరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, వెంకట్రావు, వీరబాబులను అరెస్టు చేసి, శనివారం పెద్దాపురం కోర్టులో హాజరు పరిచామని ఎస్సై తెలిపారు.


