కిక్కిరిసిన రత్నగిరి | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన రత్నగిరి

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. దర్శనం క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్‌ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. సత్యదేవుని వ్రతాలు 1,600 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునికి ఆదివారం పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయాన్ని తెరచి పూజలు చేసిన అనంతరం, స్వామి, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శంకరునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ఆయుష్య హోమం కూడా నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనేందుకు టిక్కెట్లు విక్రయించరు.

మలేరియా రహిత

జిల్లాగా తీర్చిదిద్దుదాం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): మలేరియా రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో మలేరియా నివారణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శుభ్రత, నీటి నిల్వ నివారణ, మురుగు నీటి సక్రమ పారుదల, క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్‌ వంటి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని సంక్షేమ వసతి గృహాల్లో దోమతెరలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నరసింహ నాయక్‌ కూడా పాల్గొన్నారు.

ప్రశాంతంగా పాలిసెట్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్‌ జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహించారు. కాకినాడలో 18, పెద్దాపురంలో 5, పిఠాపురంలో 5, సామర్లకోటలో 4, తునిలో 4 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు 11,313 మంది దరఖాస్తు చేసుకోగా 11,151 మంది హాజరయ్యారు. బాలురు 6,411 మందికి గాను 6,155 మంది, బాలికలు 4,902 మందికి గాను 4,636 మంది పరీక్షలు రాశారు. బాలురు 96 శాతం, బాలికలు 95 శాతం హాజరయ్యారని పాలిసెట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ వి.విజయ కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement