నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

అన్నవరం: సత్యదేవుని కల్యాణోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం రత్నగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మే 2న జరిగే శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుక కన్నుల పండువగా జరగనుంది. కల్యాణోత్సవాలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరించే రత్నగిరి క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములు రాత్రి 9 గంటలకు అన్నవరం గ్రామంలో వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగుతూ భక్తులను, గ్రామస్తులను ఆహ్వానిస్తారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి స్వామివారి దివ్య కల్యాణం వైభవంగా జరగనుంది. కల్యాణోత్సవాలకు రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది పుష్పాలంకరణ వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాదిరిగా చేయనున్నట్టు ఈఓ తెలిపారు. కల్యాణోత్సవ ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ శనివారం మధ్యాహ్నం దేవస్థానం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలను ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వివరించారు. ఈ ఉత్సవాలకు సుమారు 200 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పెద్దాపురం ఆర్‌డీఓ ఎన్‌కే శ్రీధర్‌ను జేసీ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement