గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం ఏరియల్ వ్యూ
● గ్రామ పంచాయతీల్లో
ఓటర్ల జాబితా సిద్ధం
● ఇంకా తేలని రిజర్వేషన్లు
● ఎన్నికల నిర్వహణపై వీడని సందిగ్ధత
● ఆశావహుల ఎదురుచూపులు
పిఠాపురం: పాలకవర్గాల పదవీ కాలం పూర్తయింది.. ఓటర్ల జాబితాలూ సిద్ధమయ్యాయి.. పల్లె పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు ఎదురు చూస్తున్నారు.. కానీ, ప్రభుత్వం మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేకాధికారుల పాలనకే పచ్చజెండా ఊపింది. దీంతో, గ్రామ స్వరాజ్యానికి దూరమై ఇటు ప్రజలు, కోరుకున్న పదవి దక్కే చాన్స్ కానరాక అటు అటు ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత సెప్టెంబర్‌లోనే..
రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గత ఏడాది అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీ ఓటర్ల జాబితాలు, నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారులు నియామకం, డిసెంబర్ 16 నుంచి 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, డిసెంబరు 15వ తేదీలోగా రిజర్వేషన్ల ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణ పూర్తి కావాలి. కానీ, ఏప్రిల్ నెల పూర్తవుతున్నా ఇప్పటి వరకూ ఓటర్ల జాబితా మాత్రమే పూర్తయ్యింది. కొత్త ఓటర్ల జాబితాలను ఇటీవల ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో పురుషుల కంటే 11,317 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధమవడంతో పల్లె సంగ్రామంలో పాల్గొనాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. పలువురు ఆశావహులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడం లేదు. వచ్చే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో, ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
అందరి దృష్టీ రిజర్వేషన్ల పైనే..
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డులు, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. గత రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి తమకే చాన్స్ వస్తుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఆశావహులు ముఖ్యంగా అధికార కూటమికి చెందిన వారు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే, బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అది తేలిన తరువాత కానీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కాదని అంటున్నారు. అయితే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలో నిలిచేందుకు పలువురు సర్వ శక్తులతో రెడీ అవుతున్నారు. వీరిలో అనేక మంది ఇప్పటికే స్థానికుల అవసరాలపై దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను ఇప్పటి నుంచే తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఆరంభించారు. గ్రూపుల వారీగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్యులకు తాయిలాలు ఎర చూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో గట్టి పోటీ నెలకొని ఉండటంతో రూ.లక్షల్లో సైతం ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఓటర్ల వివరాలు
గ్రామ పంచాయతీలు 385
వార్డులు 4,328
ఓటర్లు 12,58,458
వీరిలో మహిళలు 6,34,864
పురుషులు 6,23,547
ఇతరులు 47
ప్రత్యేక పాలనపై అసంతృప్తి
పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ఈ నెల 3వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ప్రత్యేకాధికారులు పాలన మొదలైంది. అయితే, ఇప్పటికే పలు విధులు నిర్వహిస్తూ తీవ్ర పనిభారంతో సతమతమవుతున్న అధికారులు.. తమకు అదనంగా అప్పగించిన పంచాయతీల పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి. అటు పాలక వర్గాలు లేక.. ఇటు ప్రత్యేకాధికారుల పాలన సక్రమంగా లేక గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్య సమస్యలు పల్లె ప్రజలను వేధిస్తున్నాయి. నిధుల కొరతతో జల్ జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సమస్య చెప్పుకుందామన్నా వినే వారు, విన్నా పరిష్కరించే వారు లేక గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు.


