అక్రమ నిర్బంధంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్బంధంపై ఆగ్రహం

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

దళిత ఎంపీటీసీ భర్తను,

మరో బీసీ నేతను తీసుకెళ్లిన పోలీసులు

పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ

నేతల నిరసన

సాక్షి, రాజమహేంద్రవరం/రంగంపేట: వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని చిత్రహింసలు పెట్టారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు.. వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తల నిరసనలు.. టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలతో రంగంపేటలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కూటమి కుట్రలతో..

రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని ఫిషర్‌మెన్‌ సొసైటీలో 270 మంది సభ్యులున్నారు. ఈ సంఘం ఎన్నికలకు గత మార్చి 5న అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. సొసైటీలో వైఎస్సార్‌ సీపీకే మెజారిటీ ఉండటంతో ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు కుట్రలకు తెర తీశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను గతంలో వాయిదా వేయించారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ మత్స్యకార సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించగా రెండు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్చు వచ్చింది. ఈ మేరకు ఈ నెల 29న ఎన్నిక జరగాల్సి ఉంది.

కిడ్నాప్‌ కేసు నమోదైందని..

దొడ్డిగుంట గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు మడికి లక్ష్మి భర్త, ఆ పార్టీ దళిత నేత మడికి వెంకట్రావు, మరో బీసీ నేత చెల్లుబోయిన వీరబాబులు వైఎస్సార్‌ సీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. వీరు ఫిషర్‌మెన్‌ సొసైటీ ఎన్నికల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఇళ్లకు రంగంపేట పోలీసులు శుక్రవారం ఉదయం వెళ్లి, వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. కూటమి మద్దతుదారులైన గుత్తుల యేసు, విత్తనాల భూరయ్య భార్యలతో వెంకట్రావు, వీరబాబులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేయించారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్లు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసుల బుకాయింపు

వెంకట్రావు, వీరబాబులను పోలీసులు తీసుకెళ్లిన సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు రంగంపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ వాళ్లను ఎక్కడ నిర్బంధించారో చెప్పాలని, వారిని వెంటనే క్షేమంగా అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అయితే, పోలీసులు బుకాయించారు. తాము ఎవ్వరినీ తీసుకు రాలేదని రాజాతో అనపర్తి సీఐ సుమంత్‌ వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భంగా సీఐ, రాజాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ తనను బెదిరించే ధోరణిలో మాట్లాడటంతో రాజా సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు తీసుకెళ్లిన దృశ్యాలు వెంకట్రావు ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు తీసుకువచ్చిన తమ పార్టీ నేతలను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ రాజా, సూర్యనారాయణరెడ్డిలు వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలసి ఏడీబీ రోడ్డుపై బైఠాయించారు. వాద్దరినీ తమకు చూపించేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ.. ఎర్రటి ఎండలోనే మొక్కవోని పట్టుదలతో ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారమూ లేకుండా ఒక దళితుడిని అక్రమంగా నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు ఇరు పక్షాలకూ సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

దిగివచ్చిన పోలీసులు

వైఎస్సార్‌ సీపీ నేతల నిరవధిక ఆందోళనతో పోలీసులు ఎట్టకేలకు దిగివచ్చారు. తాము అక్రమంగా నిర్బంధించిన వెంకట్రావు, వీరబాబులు తమ వద్దనే ఉన్నారని ఒప్పుకొని, కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేస్తున్నట్లు రాత్రి తెలిపారు. పెద్దాపురం కోర్టులో హాజరు పరిచేందుకు ప్రయత్నించగా.. శనివారం తీసుకురావాలని న్యాయమూర్తి జి.బుల్లెమ్మ ఆదేశించారని చెప్పారు. దీంతో, వెంకట్రావు, వీరబాబులను రాత్రి అనపర్తి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా వారిని అక్కడే పోలీసు కస్టడీలో ఉంచి, వారిని శనివారం పెద్దాపురం కోర్టులో హాజరుపరచనున్నారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు చూపించడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు శుక్రవారం రాత్రి ఆందోళన విరమించారు.

రాత్రి వరకూ ఆందోళన

వైఎస్సార్‌ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మరో మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, యువజన నేత జక్కంపూడి గణేష్‌ తదితరులు రంగంపేట స్టేషన్‌ వద్దకు సాయంత్రం చేరుకున్నారు. డీఎస్పీ విద్యతో చర్చలు జరిపారు. మడికి వెంకట్రావు, చెల్లుబోయిన వీరబాబులు తమ వద్దే ఉన్నారని, వారిని కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశామని, రాత్రి పెద్దాపురం కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. తమ వారిని కొట్టినట్లు తెలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు.

పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనకారులను

నెట్టివేస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement