ఉన్నట్టా.. లేనట్టా..! | - | Sakshi
Sakshi News home page

ఉన్నట్టా.. లేనట్టా..!

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

ఉపాధ్యాయ బదిలీలపై రాని స్పష్టత

సంఘాలతో చర్చలు జరపని ప్రభుత్వం

రాయవరం: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం.. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్యాల కింద దాదాపుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరందరూ బదిలీలపై ఆశలు పెట్టుకున్నారు. గత విద్యా సంవత్సరంలో పదోన్నతులు, బదిలీలు నిర్వహించారు. దీని కోసం గత ఏడాది ఏప్రిల్‌ 21న నోటిఫికేషన్‌ జారీ చేసి, ఈ ప్రక్రియను జూన్‌ 12 నాటికి పూర్తి చేసింది. ఎస్‌జీటీల బదిలీలు మాన్యువల్‌గా, మిగిలిన బదిలీలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనికి నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నారు.

మీమాంస

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లోనే కొనసాగిస్తామని షెడ్యూల్‌ విడుదల చేసింది. కానీ, వివిధ కారణాలతో ఈ ఏడాది బదిలీలుంటాయా, ఉండవా అనే మీమాంసను ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. జనాభా లెక్కల ప్రక్రియ కారణంగా బదిలీలు చేపట్టరని కొందరు.. బదిలీలకు, సెన్సన్‌కు సంబంధం ఉండదని కొందరు అంటున్నారు. గత ఏడాది ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపట్టారు. ఈసారి కొత్త జిల్లాల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. అలా జరగాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. మరోవైపు ఉమ్మడి సర్వీసు నిబంధనల అంశంపై చిక్కుముడి ఇంకా వీడలేదు. ఈ రెండు విషయాలపై స్పష్టతకు వచ్చిన తరువాతే బదిలీలు, పదోన్నతులు చేపడతారనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై, రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

సర్దుబాటుతో సరా!

బదిలీలు జరగని పక్షంలో ఉపాధ్యాయులు సర్దుబాటుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ (రేషనలైజేషన్‌) చేపడతారు. దీనికి తొలుత నిబంధనలు రూపొందించిన అనంతరం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అసంబద్ధంగా ఉంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించే అవకాశమూ ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుంటే మాత్రం కచ్చితంగా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బదిలీలపై స్పష్టత ఇవ్వాలని పలు ఉపాధ్యాయ సంఘాలు, టీచర్‌ ఎమ్మెల్సీలు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలతో చర్చించి, బదిలీల షెడ్యూల్‌ను కచ్చితంగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆందోళనకు గురవుతున్నారు

షెడ్యూల్‌ విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. వేసవి సెలవులు ప్రారంభమైనా బదిలీ షెడ్యూల్‌ ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ముందుగానే చర్చించి షెడ్యూల్‌ విడుదల చేయాలి.

– చింతాడ ప్రదీప్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు,

పీఆర్‌టీయూ, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement